Mumbai Indians: ముంబై ఇండియన్స్ టీమ్‌లో మరోసారి బయటపడిన విభేదాలు.. హార్దిక్‌ను టార్గెట్ చేస్తూ స్పిన్నర్ ఇన్‌స్టా స్టోరీ
Mumbai Indians: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మెల్లగా విజయాల బాట పడుతున్నా.. ఆ జట్టులోని విభేదాలపై మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ టీమ్ ఆల్ రౌండర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై, అతడు తీసుకునే నిర్ణయాలపై ఇప్పటికీ ఆ జట్టులోని ప్లేయర్స్ లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా ఆ టీమ్ ఆల్ రౌండర్, ఆఫ్ఘన్ ప్లేయర్ మహ్మద్ నబీ పోస్ట్ చేసిన ఇన్‌స్టా స్టోరీ చర్చనీయాంశమైంది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో తనకు బౌలింగ్ ఇవ్వకపోవడంపై నబీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఈ పోస్టు ద్వారా స్పష్టమైంది.
హార్దిక్ పాండ్యా నిర్ణయాన్ని తప్పుబడుతూ..
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు ఇచ్చినప్పటి నుంచీ ఆ జట్టులో విభేదాలనే వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు ఫీల్డ్ లో హార్దిక్ తీసుకునే నిర్ణయాలు కూడా తరచూ వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అతడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇది సహజమే అయినా.. ఆ పోస్ట్ ను ముంబై ప్లేయర్ మహ్మద్ నబీ అలాగే తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. "ముంబై ఇండియన్స్ మీ కెప్టెన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వింతగా ఉన్నాయి. ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. మహ్మద్ నబీ అసలు బౌలింగ్ చేయలేదు. గేమ్ ఛేంజర్ అతడు. ఎంతో కీలకమైన సమయంలో రెండు క్యాచ్ లు పట్టాడు, ఒక రనౌట్ చేశాడు" అనేది ఆ పోస్ట్ సారాంశం.
తనకు మద్దతుగా చేసిన ఈ పోస్టును నబీ అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. తన కెప్టెన్ నిర్ణయాన్ని ఓ అభిమాని తప్పుబడితే.. దానిని సమర్థిస్తున్నట్లుగా నబీ ఇలా పబ్లిగ్గా పోస్ట్ చేయడం చూస్తుంటే ముంబై ఇండియన్స్ జట్టులో విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే జట్టు రోహిత్, హార్దిక్ వర్గాలు విడిపోయినట్లు కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
హార్దిక్‌ను లైట్ తీసుకున్న ఆకాశ్
ఇక పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనే ముంబై ఇండియన్స్ పేస్ బౌలర్ ఆకాశ్ మధ్వాల్ వ్యవహరించిన తీరు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. మ్యాచ్ కీలకమైన దశలో ఉన్న సమయంలో అతడు హార్దిక్ ఇస్తున్న సూచనలను పట్టించుకోకుండా.. రోహిత్ శర్మనే తన కెప్టెన్ అన్నట్లుగా అతడు చెప్పిందే విన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టీమ్ రెండుగా విడిపోయిందన్న వాదనకు ఇలాంటివి మరింత బలం చేకూరుస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కిందామీదా పడి ముంబై ఇండియన్స్ గెలిచినా.. ఈ మ్యాచ్ లోనూ ఇలాంటి విమర్శలు, వివాదాలు తెరపైకి వచ్చాయి. అశుతోష్ శర్మ మెరుపులతో ఒక దశలో పంజాబ్ కింగ్స్ గెలిచేలా కనిపించినా.. చివరికి 9 పరుగులతో గెలిచి ముంబై ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం ఆ టీమ్ ఏడో స్థానానికి ఎగబాకింది.
ముంబై టీమ్ ఏడు మ్యాచ్ లలో 3 గెలిచి, 4 ఓడింది. మరో 7 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అయితే వీటిలో కనీసం ఐదు మ్యాచ్ లు గెలిస్తేనే ఆ టీమ్ ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుంది.