Hardik Pandya: మళ్లీ ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా.. అతడి కోసం ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లను వదులుకోనుందా!
Hardik Pandya: హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులో తీసుకురావడం కోసం ముంబై ఇండియన్స్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ట్రేడ్ జరిగేందుకు ఇద్దరు స్టార్ ప్లేయర్లను వదులుకునేందుకు ముంబై సిద్ధమైందని తెలుస్తోంది.
Hardik Pandya - Mumbai Indians: భారత స్టార్ ఆల్‍రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) కోసం తన పాత ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్‌కు వెళ్లనుండడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ టీమ్‍కు హార్దిక్ కెప్టెన్సీ చేశాడు. అతడి సారథ్యంలో 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్.. 2023లో ఫైనల్ చేరింది. అయితే, హార్దిక్‍ను మళ్లీ తన జట్టులో తీసుకొచ్చేందుకు డీల్‍ను ముంబై ఇండియన్స్ ఇప్పటికే పూర్తి చేసుకుందని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా కోసం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజ్‍కు రూ.15కోట్లను ముంబై ఇండియన్స్ చెల్లించనుంది. అలాగే, రిలీజ్ నిబంధన కింద కొంత అదనపు మొత్తాన్ని కూడా ముంబై ఇవ్వనుంది. హార్దిక్ పాండ్యా ట్రేడ్.. క్యాష్ డీల్‍గానే జరుగుతోంది.
హార్దిక్ పాండ్యా డీల్‍పై అధికారిక ప్రకటన వస్తే.. ఐపీఎల్ చరిత్రలో ఇది అతిపెద్ద ప్లేయర్ ట్రేడ్‍గా నిలిచిపోనుంది. హార్దిక్ పాండ్యా విషయంపై ముంబై ఇండియన్స్ ఆదివారం (నవంబర్ 26) అధికారిక ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. ఏఏ ఆటగాళ్లను కొనసాగించాలనుకుంటున్నారో.. ఎవరిని రిలీజ్ చేయాలనుకుంటున్నారో రిటెన్షన్‍ను ఫ్రాంచైజీలు ప్రకటించేందుకు ఆదివారమే ఆఖరి తేదీగా ఉంది.
గ్రీన్, ఆర్చర్‌కు గుడ్‍బై
హార్దిక్ పాండ్యా డీల్‍ను విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు, డిసెంబర్ 19న జరిగే వేలం కోసం పర్సును పెంచుకునేందుకు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్, ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ఐపీఎల్ మినీ వేలంలో గ్రీన్‍ను రూ.17.5కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. 2022 మెగా వేలంలో ఆర్చర్‌ను రూ.8కోట్లకు తీసుకుంది. పాండ్యా డీల్ పూర్తి చేసుకున్నా.. కొన్ని ఫండ్స్ పర్సులో ఉంటాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఆర్చర్, గ్రీన్ ఇద్దరిని రిలీజ్ చేసేందుకు ముంబై నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై ఆదివారం (నవంబర్ 26) క్లారిటీ రానుంది.
2015లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‍లో హార్దిక్ పాండ్యా అడుగుపెట్టాడు. 2021 వరకు ఆ టీమ్ తరఫునే ఆడాడు. ఎన్నోసార్లు అద్భుతమైన ప్రదర్శన చేసి స్టార్ ఆల్ రౌండర్‌గా ఎదిగాడు. అయితే, 2022 సీజన్‍లో గుజరాత్ టైటాన్స్ హార్దిక్‍ను దక్కించుకుంది. కెప్టెన్‍గా 2022 సీజన్‍లో గుజరాత్‍కు టైటిల్ అందించాడు పాండ్యా. ఈ ఏడాది సీజన్‍లో హార్దిక్ సారథ్యంలోని గుజరాత్ ఫైనల్ వరకు వెళ్లింది.