WPL 2025 Eliminator: దంచికొట్టిన హేలీ, సీవర్.. ఫైనల్లో ముంబయి ఇండియన్స్.. గుజరాత్ ఎలిమినేట్
WPL 2025 Eliminator: డబ్ల్యూపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. ఈ మాజీ ఛాంపియన్ రెండో సారి ఫైనల్ చేరింది. హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ చెలరేగడంతో ఎలిమినేటర్ లో గుజరాత్ జెయింట్స్ ను చిత్తుచేసింది.

డబ్ల్యూపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ ఫైనల్ లో అడుగుపెట్టింది. ముంబయిలోనే గురువారం (మార్చి 13) జరిగిన ఎలిమినేటర్ లో గుజరాత్ జెయింట్స్ ను చిత్తచేసింది. ముంబయి ఇండియన్స్ 47 పరుగుల తేడాతో గెలిచింది. ఓటమితో గుజరాత్ ఇంటి ముఖం పట్టింది. ఫస్ట్ ముంబయి 213/4 స్కోరు చేసింది. ఛేజింగ్ లో గుజరాత్ 166 పరుగులకే ఆలౌటైంది.
ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరింది. ఢిల్లీ, ముంబయి మధ్య టైటిల్ పోరు శనివారం (మార్చి 15) జరుగుతుంది.
తొలి ఓవర్లోనే
డబ్ల్యూపీఎల్ 2025 ఎలిమినేటర్ లో ముంబయి ఇండియన్స్ తో ఛేజింగ్ లో గుజరాత్ పూర్తిగా ఫెయిలైంది. ఏ దశలోనూ ఆ జట్టు గెలిచేలా కనిపించలేదు. హేలీ మాథ్యూస్ (3/31) బంతితోనూ గుజరాత్ ను చావుదెబ్బ తీసింది. అమేలియా కెర్ రెండు వికెట్లు పడగొట్టింది. ఛేజింగ్ తొలి ఓవర్లోనే బెత్ మూనీ (6)ని ఔట్ చేసిన షబ్నిమ్.. గుజరాత్ కు షాకిచ్చింది.
టపటపా వికెట్లు
బెత్ మూనీ వికెట్ ను కోల్పోయిన గుజరాత్ ను గిబ్సన్ (34) ఆదుకునే ప్రయత్నం చేసింది. కానీ వరుస ఓవర్లలో హర్లీన్ డియోల్ (8), కెప్టెన్ ఆష్లీ గార్డ్ నర్ (8) ఔటవడంతో గుజరాత్ కోలుకోలేకపోయింది. గిబ్సన్ తో పాటు లిచ్ ఫీల్డ్ (31), భార్తి ఫుల్మాలి (30) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.
ముంబయి దంచుడు
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ గ్రౌండ్ లో పరుగుల విధ్వంసాన్ని కళ్లకు కట్టింది. గుజరాత్ బౌలర్లను ముంబయి ఊచకోత కోసింది. ముఖ్యంగా హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 77), నాట్ సీవర్ (41 బంతుల్లో 77) రెచ్చిపోయారు. ఎడాపెడా బౌండరీలు బాదేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (12 బంతుల్లోనే 36) ఆ పరుగుల మోతను మరో లెవల్ కు తీసుకెళ్లింది.
స్లో స్టార్ట్
ఫస్ట్ ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ స్లోగా స్టార్ట్ అయింది. యాస్తిక భాటియా (14 బంతుల్లో 15) స్పీడ్ గా ఆడలేకపోయింది. ఆమె వికెట్ పడే సమయానికి ముంబయి 4.2 ఓవర్లలో 26 పరుగులే చేసింది. కానీ ఆ వికెట్ తో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. గుజరాత్ కష్టాల్లో కూరుకుపోగా.. ముంబయి పరుగుల వరద పారించింది. క్రీజులోకి వచ్చిన నాట్ సీవర్.. హేలీ మాథ్యూస్ తో కలిసి రెచ్చిపోయింది.
ఈ ఇద్దరు చెరో 10 ఫోర్లు కొట్టారు. హేలీ 3 సిక్సర్లు, నాట్ సీవర్ 2 సిక్సర్లు బాదారు. ఆఖర్లో హర్మన్ మరింతగా మెరుపు షాట్లతో చెలరేగిపోయింది. ఆమె 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టింది. చివరి బంతికి ఔటైన హర్మన్ జట్టు స్కోరును 210 దాటించింది.
సంబంధిత కథనం