టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల ప్రక్రియ కంప్లీట్ అయింది. గురువారం (మార్చి 20) ఈ దంపతులకు ముంబయి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. చాహల్, ధనశ్రీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. డివోర్స్ గ్రాంట్ చేసిన తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
విడాకుల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 5న చాహల్-ధనశ్రీ ముంబయి ఫ్యామిలీ కోర్టులో జాయింట్ పిటిషన్ దాఖలు చేశారు. విడాకులు మంజూరు చేసేందుకు 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ను రద్దు చేయాలని కోరారు. కానీ ఫ్యామిలీ కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఈ ఇద్దరూ బాంబే హై కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను బుధవారం విచారించిన బాంబే హై కోర్టు.. గురువారం తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.
ఐపీఎల్ 2025లో చాహల్.. పంజాబ్ కింగ్స్ తరపున ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరగా చాహల్ విడాకుల కేసు తేల్చాలని బాంబే హై కోర్టు సూచించింది. పైగా ఈ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నారని, భరణంగా రూ.4.75 కోట్లను చెల్లించేందుకు చాహల్ ఒప్పుకొన్నాడని కోర్టు తెలిపింది. ఇప్పటికే ఇందులో నుంచి రూ.2.37 కోట్లను ధనశ్రీకి చెల్లించాడని తెలిపింది. అందుకే ఫ్యామిలీ కోర్టు చాహల్-ధనశ్రీ విడాకుల పిటిషన్ పై తీర్పు వెల్లడించింది.
గురువారం ముంబయి ఫ్యామిలీ కోర్టుకు చాహల్, ధనశ్రీ వచ్చారు. విడాకులు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కోర్టు వీళ్లకు విడాకులు గ్రాంట్ చేసింది. ‘‘కోర్టు విడాకులు గ్రాంట్ చేసింది. ఇరు వర్గాలు దాఖలు చేసిన జాయింట్ పిటిషన్ ను కోర్టు ఆమోదించింది. ఇకపై ఈ ఇద్దరు (చాహల్, ధనశ్రీ) భార్యాభర్తలు కాదు’’ అని చాహల్ తరపు లాయర్ నితిన్ కుమార్ పేర్కొన్నారు.
చాహల్, ధనశ్రీ 2020 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. డెంటిస్ట్ అయిన ధనశ్రీ వర్మ యూట్యూబ్ లో డ్యాన్స్ వీడియోలతో మరింత పాపులర్ అయింది. టిక్ టాక్ వీడియోలతో అలరించింది. శ్రేయస్ అయ్యర్, ధావన్ తదితర టీమిండియా క్రికెటర్లతో ఆమె చేసిన డ్యాన్స్ రీల్స్ వైరల్ అయ్యాయి. అలాగే హిందీలో ఓ డ్యాన్స్ రియాలిటీ షోలోనూ ఆమె పార్టిసిపేట్ చేసింది.
చాహల్-ధనశ్రీ జూన్ 2022 నుంచే సెపరేట్ గా ఉంటున్నారు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ బ్రేక్ అయింది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో ఒకరి అకౌంట్ ను మరొకరు అన్ ఫాలో కావడంతో విడాకుల రూమర్స్ మరింత పెరిగాయి. ధనశ్రీ ఫొటోలను చాహల్ డిలీట్ చేశాడు. ఇప్పుడు ఈ జోడీ అధికారికంగా విడిపోయింది.
సంబంధిత కథనం