ధోని రిటైర్మెంట్ ఇప్పుడే కాదు. ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు ఎంఎస్. 43 ఏళ్ల అతను ఈ సీజన్ తో ఐపీఎల్ కు గుడ్ బై చెప్తాడనే ఊహాగానాలు వచ్చాయి. ఆదివారం (మే 25) గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ తో సీఎస్కే ఈ సీజన్ ను ముగించింది. ఈ మ్యాచ్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం సాగింది. కానీ ధోని మాత్రం ఏ మాట క్లారిటీగా చెప్పలేదు.
‘‘సీజన్ గొప్పగా సాగలేదు. కానీ మంచిగా ముగించాం. ఈ మ్యాచ్ లో పర్ ఫెక్ట్ ప్రదర్శన ఇచ్చాం. ఫీల్డింగ్, క్యాచింగ్ కూడా మెరుగైంది. డిసైడ్ (రిటైర్మెంట్) చేసుకోవడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉంది. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. కేవలం ప్రదర్శన మాత్రమే కాదు.. నీలో ఎంత ఆకలి ఉందన్నదే ముఖ్యం. డిసైడ్ కావడానికి నాకు సరిపడా టైమ్ ఉంది’’ అని మ్యాచ్ అనంతరం ధోని వ్యాఖ్యానించాడు.
‘‘తిరిగి రాంచీ వెళ్తా. నా పని అయిపోయిందని చెప్పడం లేదు. అలాగే తిరిగి వస్తానని కూడా చెప్పడం లేదు. నాకు టైమ్ ఉంది. ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభంలో ఫస్ట్ ఆరు మ్యాచ్ ల్లో నాలుగు చెన్నైలోనే ఆడాం. టాస్ గెలిచాం, ఛేజ్ చేశాం. సెకండ్ ఇన్నింగ్స్ లో ఒత్తిడి ఎదుర్కొన్నాం. బ్యాటింగ్ డిపార్ట్ మెంట్ గురించే ఆందోళన చెందా. రుతురాజ్ తిరిగి వచ్చిన తర్వాత మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ధోని పేర్కొన్నాడు.
కేవలం ఐపీఎల్ లోనే ఆడుతున్న ధోని రిటైర్మెంట్ పై ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఒక్కో సీజన్ కు ఫిట్ నెస్ కాపాడుకుంటూ వచ్చాడు ధోని. కానీ ఇప్పుడు 43 ఏళ్ల వయసులో వచ్చే సీజన్ కోసం ఏడాది పాటు ఫిట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అది సాధ్యం కాకపోవచ్చు. ఇక ఈ సీజన్ లో సీఎస్కే దారుణమైన ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్ ల్లో 4 మాత్రమే గెలిచింది. ఐపీఎల్ లో తొలిసారి లాస్ట్ ప్లేస్ తో సీజన్ ను ముగించింది.
బ్యాటర్ గానూ ధోని ఫెయిల్ అయ్యాడు. 14 మ్యాచ్ ల్లో 196 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో జట్టు భవిష్యత్ కోసం ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ధోనీపై విమర్శలు ఎక్కువయ్యాయి. అతను తప్పుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ లో ఎంఎస్ ధోనీకి అద్భుతమైన కెరీర్ ఉంది. 2008 నుంచి 2025 వరకు వరుసగా 18 సీజన్ల పాటు ఈ లీగ్ లో ఆడాడు మాహి. 16 ఏళ్ల పాటు సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించాడు. మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా రెండేళ్ల పాటు సీఎస్కేపై నిషేధం పడ్డ సమయంలో 2016, 2017లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కు ఆడాడు ధోని. ఐపీఎల్ లో ధోని 278 మ్యాచ్ ల్లో 5439 పరుగులు చేశాడు. 24 హాఫ్ సెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు.
సంబంధిత కథనం