Dhoni Stumping: ధోనీ 43 ఏళ్ల వయసులోనూ తన వికెట్ కీపింగ్ స్పీడుతో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోనీ చేసిన ఓ స్టంపింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ను కళ్లు మూసి తెరిచేలోపు అతడు పెవిలియన్ కు పంపిన తీరు చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.
నూర్ అహ్మద్ బౌలింగ్ లో గూగ్లీకి సాల్ట్ కంగు తినగా.. అతడు తేరుకునేలోపే స్టంప్స్ వెనుక ధోనీ మిగిలిన పని పూర్తి చేశాడు. సాల్ట్ కాలు సెకనులో పదో వంతు మాత్రమే గాల్లో ఉంది. ధోనీకి స్టంప్స్ ను గిరాటేయడానికి ఆ సమయం సరిపోయింది. అది చూసి సాల్ట్ షాక్ తిన్నాడు.
ఐపీఎల్ 2025లో ధోనీ వరుసగా రెండో మ్యాచ్ లో ఇలా మెరుపు స్టంపింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనూ సూర్యకుమార్ యాదవ్ ను ధోనీ స్టౌంపౌట్ చేసిన తీరు ఆశ్చర్యపరిచింది. అప్పుడు కూడా నూర్ అహ్మద్ బౌలింగ్ లోనే ధోనీ ఈ స్టంపింగ్ చేయడం విశేషం. వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తడమే కాదు.. 43 ఏళ్ల వయసులో వికెట్ల వెనుక కూడా అదే వేగం తన సొంతమని ధోనీ మరోసారి నిరూపించాడు.
ధోనీ చేసిన ఈ స్టంపింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న డానీ మోరిసన్ ధోనీ స్టంపింగ్ చూసి నోరెళ్లబెట్టాడు. ఆ సమయానికి సాల్ట్ కాస్త దూకుడుగా ఆడుతున్నాడు. 15 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఇలాంటి సమయంలో అతని జోరు అడ్డుకోవడానికి ఏదైనా అద్భుతమే జరగాల్సి ఉంది. దానిని ధోనీయే చేసి చూపించాడు.
సంబంధిత కథనం