MS Dhoni Jersey: ధోనీ జెర్సీపై నంబర్ 7 ఎందుకు.. అతని సమాధానం వింటే నవ్వు ఆపుకోలేరు
MS Dhoni Jersey: ధోనీ జెర్సీ నంబర్ 7 ఎందుకు? చాలా మంది దురదృష్టంగా భావించే ఆ నంబర్ నే అతడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు. దీనికి తాజాగా మిస్టర్ కూల్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. ఇది వింటే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు.
MS Dhoni Jersey: ఏడును దురదృష్ట అంకెగా భావించే వాళ్లే చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ అదే నంబర్ ను టీమిండియా గ్రేట్ కెప్టెన్లలో ఒకడైన ఎమ్మెస్ ధోనీ తన జెర్సీ నంబర్ గా మార్చుకున్నాడు. అతనితోపాటే ఆ జెర్సీ నంబర్ కు కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. మరి ఆ 7ను ఎంపిక చేసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నదానిపై తాజాగా ధోనీ స్పందించాడు.
ధోనీ నంబర్ 7 వెనుక స్టోరీ ఇదీ..
ధోనీ ఈ మధ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడి యాంకర్ అతని జెర్సీ నంబర్ 7పై ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగాడు. మీ జెర్సీ నంబర్ 7 ఎందుకు.. మీ పేరెంట్స్ ప్రతి రోజూ ఆ సమయానికి ఇంటికి రావాల్సిందే అని చెప్పారా అని సదరు యాంకర్ కాస్త సరదాగా ప్రశ్నించాడు. దీనికి ధోనీ కూడా తనదైన స్టైల్లో స్పందించడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోయారు.
"అది మా పేరెంట్స్ నన్ను ఈ భూమి మీదికి తీసుకురావడానికి ఎంచుకున్న సమయం లేదా తేదీ కావచ్చు. అందుకే నేను జులై 7న జన్మించాను. జులై ఏడో నెలే. ఇక 81వ ఏడాది. అంటే 8-1=7 అవుతుంది కదా. అందుకే నీకు ఏ నంబర్ కావాలని అడిగినప్పుడు చెప్పడానికి నాకు చాలా ఈజీ అవుతుంది" అని ధోనీ అన్నాడు. ప్రతి ప్రశ్నకు తనదైన రీతిలో కాస్త చమత్కారాన్ని జోడించి చెప్పే అలవాటున్న ధోనీ.. ఇప్పుడూ అలాగే స్పందించేసరికి అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వారు.
జెర్సీ నంబర్ 7తో ధోనీ మ్యాజిక్
ఏడు అనే నంబర్ చూస్తే చాలా మంది భయపడతారు. అది అంత అదృష్ట సంఖ్య కాదన్నది వాళ్ల నమ్మకం. కానీ అదే నంబర్ తో ధోనీ క్రికెట్ లో అద్బుతాలు క్రియేట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ గా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ అందించాడు. ఇండియన్ క్రికెట్ టీమ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అతని గౌరవార్థం బీసీసీఐ ధోనీ రిటైరైన తర్వత అతని ఏడో నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించింది.
అంటే ఇక నుంచి ఏ ఇతర క్రికెటర్ ఆ నంబర్ ఎంచుకోవడానికి అవకాశం ఉండదు. అంతకుముందు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు కూడా ఇదే గౌరవం దక్కింది. అతని జెర్సీ నంబర్ 10కి బోర్డు రిటైర్మెంట్ ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీ ఏకంగా ఆరు టైటిల్స్ అందుకోవడం విశేషం.
ఇప్పుడు 42 ఏళ్ల వయసులో మరోసారి ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మధ్యే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. ధోనీ టీమిండియా తరఫున 350 వన్డేలు ఆడి 10,773 రన్స్ చేశాడు. సగటు 50.57 కావడం విశేషం. అందులో 10 సెంచరీలు, 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 90 టెస్టుల్లో 4876 రన్స్, 98 టీ20ల్లో 1617 రన్స్ చేశాడు. ఇక ధోనీ కెప్టెన్సీలో 2013లో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ మరో ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది.