ఇండియన్ క్రికెట్ రాతనే మార్చేసిన కెప్టెన్, రెండు వరల్డ్ కప్స్ గెలిచిన మిస్టర్ కూల్ ఎమ్మెస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. అతడు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. సోమవారం (జూన్ 9) ఐసీసీ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. ఈ ఘనత సాధించిన 11వ ఇండియన్ ప్లేయర్ గా అతడు నిలిచాడు.
టీమిండియాకు టీ20, వన్డే వరల్డ్ కప్ లతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సాధించి పెట్టిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. అతనికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ సోమవారం (జూన్ 9) వెల్లడించింది.
“అసాధారణ, సాంప్రదాయేతర, ప్రభావంతమైన క్రికెటర్.. గణాంకాలకు అతీతమైన ప్లేయర్.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేరాడు” అనే క్యాప్షన్ తో ఐసీసీ ట్వీట్ చేసింది.
తనను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి చేర్చడంపై ధోనీ స్పందించాడు. ఇదో గొప్ప గౌరవం అని, జీవితాంతం గుర్తుంచుకుంటానని అన్నాడు. “ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కడం గొప్ప గౌరవం.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జనరేషన్లుగా క్రికెటర్లు అందించిన సేవలను గుర్తిస్తోంది. అలాంటి గొప్ప ప్లేయర్స్ సరసన మన పేరును గుర్తు పెట్టుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. నా జీవితాంతం గుర్తంచుకుంటాను” అని ధోనీ అన్నాడు.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఇప్పటి వరకూ ధోనీతో కలిపి 11 మంది ఇండియన్ ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. వాళ్లలో 9 మంది మెన్స్ టీమ్ ప్లేయర్స్ కాగా.. మరో ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు.
హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఇండియన్ ప్లేయర్స్ ను చూస్తే.. బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, వీరేంద్ర సెహ్వాగ్ లకు ఈ గౌరవం దక్కింది. ఇక మహిళల క్రికెట్ లో డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్ లు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఉన్నారు. ఇప్పుడు ధోనీ కూడా వీళ్ల సరసన చేరాడు.
సంబంధిత కథనం