ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ధోని ఫ‌స్ట్ రియాక్ష‌న్ ఇదే.. ఏమ‌న్నారంటే?-ms dhoni first reaction on including icc hall of fame list goes viral ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ధోని ఫ‌స్ట్ రియాక్ష‌న్ ఇదే.. ఏమ‌న్నారంటే?

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ధోని ఫ‌స్ట్ రియాక్ష‌న్ ఇదే.. ఏమ‌న్నారంటే?

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీకి చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన అతి కొద్దిమంది భారత క్రికెటర్లలో ఒకరిగా ధోని నిలిచాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు పై ధోని తొలిసారి రియాక్టయ్యాడు.

ఓ ఈవెంట్ లో మైక్ హస్సీతో మాట్లాడుతున్న ధోని (ICC)

భారత క్రికెట్ కు చేసిన సేవలకు గాను లెజెండరీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి చోటు దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత అబ్బే రోడ్ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఏడుగురు దిగ్గజ ఆటగాళ్లలో భారత మాజీ కెప్టెన్ కూడా ఉన్నాడు. ఈ ఘనత దక్కడం పట్ల ధోని తొలిసారి రియాక్టయ్యాడు.

ఎప్పటికీ గుర్తుంచుకుంటా

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న అనంతరం ధోని తొలిసారి స్పందించాడు. ‘‘తరతరాలుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల సేవలను గుర్తించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకోవడం గౌరవంగా భావిస్తున్నా. అలాంటి ఆల్ టైమ్ గ్రేట్స్ తో పాటు నా పేరు గుర్తుండిపోవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇది నేను ఎప్పటికీ గుర్తుంచుకునే విషయం’’ అని ధోని అన్నాడు.

వీళ్లు కూడా

ధోనీతో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్ దిగ్గజం డేనియల్ వెటోరి ఈ గౌరవాన్ని అందుకున్నారు. పాకిస్థాన్ కు చెందిన సనా మిర్, ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ సారా టేలర్ లు కలిసి మొత్తం హాల్ ఆఫ్ ఫేమ్స్ ను 122కు చేర్చారు. 'ఎ డే విత్ ది లెజెండ్స్' కార్యక్రమంలో ఏడుగురు ప్రముఖ క్రికెటర్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, మీడియా సభ్యులు ఎంపిక చేశారు. 2009లో హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమాన్ని మొదలెట్టారు.

మూడు టైటిళ్లు

17000కు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన ధోనీ మూడు ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లను గెలిచిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని దేశానికి అందించాడు ధోని. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్ గా ధోనీ నిలిచాడు. అతని కంటే ముందు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, దియాన్ ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతూ డేవిడ్ ఈ గౌరవాన్ని అందుకున్నారు.

రికార్డు ఇలా

90 టెస్టుల్లో 256 క్యాచ్ లు, 38 స్టంపింగ్ లతో పాటు 4,876 పరుగులు చేశాడు ధోని. 350 వన్డేల్లో 50.57 సగటుతో 10,773 పరుగులు సాధించాడు. 321 క్యాచ్ లు, 123 స్టంపింగ్ లు చేశాడు. 98 అంతర్జాతీయ టీ20ల్లో 1,617 పరుగులు చేశాడు. 57 క్యాచ్ లు పట్టాడు. 34 స్టంపింగ్స్ చేశాడు.

డిసెంబర్ 2009 నుండి 18 నెలల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న అతను చివరికి 2011 లో 50 ఓవర్ల ప్రపంచ కప్ ను గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ లో అతను విన్నింగ్ సిక్స్ కొట్టాడు. 2019 చివరిలో ఐసీసీ దశాబ్దపు వన్డే, టీ20 జట్లకు ధోని ఎంపికయ్యాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం