MS Dhoni Dance: జోష్‍తో డ్యాన్స్ చేసిన ధోనీ.. పంత్‍, రైనాతో కలిసి చిందులు: వీడియో-ms dhoni dances with rishabh pant and suresh raina in wedding ceremony ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni Dance: జోష్‍తో డ్యాన్స్ చేసిన ధోనీ.. పంత్‍, రైనాతో కలిసి చిందులు: వీడియో

MS Dhoni Dance: జోష్‍తో డ్యాన్స్ చేసిన ధోనీ.. పంత్‍, రైనాతో కలిసి చిందులు: వీడియో

MS Dhoni Dance: రిషబ్ పంత్, సురేశ్ రైనాతో కలిసి భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చిందేశాడు. ఫుల్ జోష్‍తో డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

MS Dhoni Dance: జోష్‍తో డ్యాన్స్ చేసిన ధోనీ.. పంత్‍, రైనాతో కలిసి చిందులు: వీడియో

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫుల్ జోష్‍తో చిందేశాడు. టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, సురేశ్ రైనాతో కలిసి డ్యాన్స్ చేశాడు. రిషబ్ పంత్ సోదరి సాక్షి పంత్ వివాహ వేడుకలో ధోనీ ఇలా ఫుల్ జోష్ చూపారు. గత వారం ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత జట్టులో పంత్ ఉన్నాడు. దుబాయ్‍ నుంచి వచ్చి సోదరి పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు.

జోష్‍తో చిందులు

పంత్ సోదరి వివాహంలో ధోనీ డ్యాన్స్ చేశాడు. బాలీవుడ్ పాట “దమ్ దమ్ మస్త్ కలందర్” పాట వస్తుంటే హుషారుగా చిందేశాడు. పంత్, రైనాతో కలిసి రౌండ్‍గా నిలబడి ఎగిరాడు ధోనీ. ఉత్తరాఖండ్‍లోని ముసోరీలో ఈ వివాహ వేడుక జరిగింది.

ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సాక్షి పంత్ ఇన్‍స్టాగ్రామ్‍ స్టోరీల్లో పోస్ట్ చేశారు. చాలా కాలంగా ప్రేమిస్తున్న అంకిత్ చౌదరిని సాక్షి వివాహం చేసుకున్నారు. జనవరిలోనే వీరి ఎంగేజ్‍మెంట్ జరిగింది. తాము తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉన్నామని ఆమె అప్పుడే చెప్పారు.

సోషల్ మీడియాలో వైరల్

పంత్, రైనాతో కలిసి ధోనీ చిందేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి ఎంతో ఆనందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ధోనీ, పంత్ మధ్య బాండ్ ఎంత బాగుందో దీన్ని బట్టి తెలుస్తోందని మరికొందరు అంటున్నారు. ధోనీ, రైనాను ఉద్దేశించి తలా, చిన్న తలా డ్యాన్స్ ఇరగదీశారని ఖుషీ అవుతున్నారు.

ఐపీఎల్‍కు సిద్ధమవుతున్న ధోనీ, పంత్

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టుతో దుబాయ్‍కు వెళ్లాడు రిషబ్ పంత్. అయితే, ఒక్క మ్యాచ్‍లోనూ తుది జట్టులో ఛాన్స్ దక్కలేదు. ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న మొదలుకానుంది. ఈ సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లక్నో జట్టుకు మారాడు. లక్నోకు సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో రూ.27కోట్లకు పంత్‍ను లక్నో దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు.

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‍కే) క్యాంప్‍లో ఇటీవలే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు ధోనీ. ఈ సీజనే అతడికి చివరిది అనే రూమర్లు ఉన్నాయి. గతేడాదే రుతురాజ్ గైక్వాడ్‍కు సీఎస్‍కే కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ అప్పజెప్పాడు. కెప్టెన్‍గా చెన్నైకు ఐదు ట్రోఫీలో అందించాడు మహీ. ఐపీఎల్ 2025 సీజన్‍కు గాను ధోనీని అన్‍క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.4కోట్లకు సీఎస్‍కే రిటైన్ చేసుకుంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం