ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ కు ముందు ధోని ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ లో వీలైనంత కాలం కొనసాగుతానని గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో ధోనీకి లాస్ట్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ధోని మాత్రం లీగ్ లో కంటిన్యూ అవుతానని చెప్పాడు. ఆదివారం (మార్చి 23) చెపాక్ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
ఐపీఎల్ లో తాను అనుకున్నంత కాలం సీఎస్కేకు ఆడగలనని ఈ రోజు సీఎస్కే మ్యాచ్ నేపథ్యంలో జియోహాట్ స్టార్ తో ధోని పేర్కొన్నాడు. ‘‘సీఎస్కేకు నేను అనుకున్నంత కాలం ఆడగలను. అదే నా ఫ్రాంఛైజీ. ఒకవేళ నేను వీల్ ఛెయిర్ లో ఉన్నా.. వాళ్లు నన్ను మ్యాచ్ ఆడేందుకు లాగుతారు’’ అని ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ ఐపీఎల్ 2025 కోసం చెన్నైలో అడుగుపెట్టిన సమయంలో ధోని వేసుకున్న టీషర్ట్ పై కోడ్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మోర్స్ కోడ్ లో ‘వన్ లాస్ట్ టైం’ అని ఉన్న టీషర్ట్ ను వేసుకుని ధోని వచ్చాడు. దీంతో ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ప్రచారం జోరందుకుంది. కానీ 43 ఏళ్ల ధోని మాత్రం ఇంకా ఈ లీగ్ లో కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.
అందుకే ఫ్రాంఛైజీ కానీ తాను కానీ ఒకరికొకరం వీడ్కోలు చెప్పేందుకు సిద్దంగా లేమని ధోని అనడం ఫ్యాన్స్ కు ఆనందాన్నిస్తోంది.
2023 ఐపీఎల్ సీజన్లో మోకాలి గాయంతో పోరాడుతూనే ధోని ఆడాడు. 2024లో ఫినిషర్ గా కీలక పాత్ర పోషించాడు. ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. ధోని అడుగుపెట్టగానే స్టేడియాలు మార్మోగిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో ధోని భారీ షాట్లతో చెలరేగాడు. ఆ సీజన్ మొత్తంలో 73 బంతులే ఆడిన ధోని.. 220 స్ట్రైక్ రేట్ తో 161 పరుగులు చేశాడు.
ఐపీఎల్ లో ధోని మరో రికార్డుపై కన్నేశాడు. ఈ లీగ్ హిస్టరీలో సీఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని నిలిచే అవకాశముంది. అందుకు ధోని ఇంకా 19 పరుగులు చేస్తే చాలు. సురేశ్ రైనా (4687)ను దాటి సీఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని హిస్టరీ క్రియేట్ చేస్తాడు.
సంబంధిత కథనం