MS Dhoni Rohit Sharma: ధోనీ అంటే మిస్టర్ కూల్. వివాదాలకు దూరంగా ఉంటాడు. వివాదాస్పద కామెంట్స్ చేయడు. కానీ అతడు ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్సీ గురించి చేసిన కామెంట్స్ మాత్రం అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉద్దేశించి ధోనీ పరోక్షంగా చేసిన కామెంట్సే అవి అంటూ వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
ఐపీఎల్ సందర్భంగా ఈ మధ్యే ధోనీ జియోహాట్‌స్టార్ కు ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చాలా అంశాలపై అతడు స్పందించాడు. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, రుతురాజ్ కు పగ్గాలు అప్పగించడంపైనా మాట్లాడాడు. రుతురాజ్ కు కెప్టెన్సీ అప్పగించడం సరైన నిర్ణయం అని చెబుతూ.. ఓ కెప్టెన్ సరైన ఫామ్ లో లేకపోవడం జట్టుకు ఎలా చేటు చేస్తుందో అన్న విషయాన్ని ధోనీ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్సే రోహిత్ ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉన్నాయని ఇప్పుడు ఫ్యాన్స్ అంటున్నారు.
“పర్ఫార్మెన్స్ బాగా లేనప్పుడు, వ్యక్తిగతంగా సరిగా పర్ఫామ్ చేయకపోయినా మీ కెప్టెన్సీ బాగుంటే.. అది జట్టుకు సమస్యగా మారుతుంది. ముందుగా నిలకడగా రాణించే వ్యక్తిని జట్టు కెప్టెన్ ను చేయాలి. మొదట వ్యక్తిగత ప్రదర్శన బాగుండాలి. ఆ తర్వాతే కెప్టెన్సీ” అని ధోనీ అన్నాడు. ఈ కామెంట్స్ రోహిత్ ను లక్ష్యంగా చేసినవే అని, ముఖ్యంగా అతని టెస్ట్ క్రికెట్ ప్రదర్శన గురించే అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
ధోనీ ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశాడో కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో అవి రోహిత్ గురించే అంటూ ప్రచారం మొదలుపెట్టారు. పరోక్షంగా ఎవరిని టార్గెట్ చేస్తున్నావని ఒకరు.. రోహిత్ ఇది నీ గురించే అని మరొకరు.. ఇది రోహిత్ కు ఘోర అవమానం అని ఇంకొకరు కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు కూడా ఇది వర్తిస్తుందని అని అనడం గమనార్హం. రోహిత్ కెప్టెన్సీలో గతేడాది టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా.. స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఓటమి, తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోల్పోవడం.. రోహిత్ వ్యక్తిగత ప్రదర్శన కూడా దారుణంగా ఉండటంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
వాటికి ఛాంపియన్స్ ట్రోఫీ విజయం ద్వారా, ఫైనల్లో రాణించడం ద్వారా రోహిత్ సమాధానం చెప్పాడు. ఇప్పట్లో వన్డే క్రికెట్ నుంచి రిటైర్ కానని కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో ధోనీ చేసిన ఈ కామెంట్స్ మరోసారి రోహిత్ కెప్టెన్సీ వైఫల్యాలను తెరమీదికి తీసుకొచ్చాయి.
సంబంధిత కథనం