పంజాబ్ కింగ్స్ క్రికెటర్, ఆస్ట్రేలియన్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన క్రికెటర్‌గా నిలిచాడు.
మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. సాయి కిషోర్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఐపీఎల్‌లో 19 సార్లు డకౌట్ అయిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ రికార్డును గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 18 సార్లు డకౌట్ అయ్యాడు. రోహిత్‌తో పాటు దినేష్ కార్తీక్ కూడా 18 డకౌట్స్‌తో సమంగా ఉన్నాడు. వీరిద్దరి చెత్త రికార్డును మ్యాక్స్‌వెల్ దాటేశాడు.
డకౌట్ లిస్ట్‌లో పీయూష్ చావ్లా 16 డక్స్‌తో నాలుగో స్థానం, సునీల్ నరైన్ 16 డకౌట్స్‌తో ఐదో స్థానాల్లో కొనసాగుతోన్నారు. రషీద్‌ఖాన్(15), మన్‌దీప్ సింగ్(15), మనీష్ పాండే(14), అంబాటిరాయుడు(14) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతోన్నారు. రోహిత్ శర్మ 253 ఇన్సింగ్స్‌లలో 18 సార్లు డకౌట్ కాగా... మ్యాక్స్‌వెల్ 130 ఇన్సింగ్స్‌లలో 19 సార్లు జీరో స్కోరుకు ఔటయ్యాడు.
మొత్తంగా టీ20 కెరీర్‌లో 460 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 35 సార్లు డకౌట్ అయ్యాడు. టీ20 ఫార్మెట్‌లో అత్యధిక సార్లు సున్నా పరుగులకే ఔట్ అయినా నాలుగో క్రికెటర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు.
2021 నుంచి 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు మ్యాక్స్‌వెల్. కానీ గత ఏడాది 10 మ్యాచుల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని పక్కనపెట్టింది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో తొలి రోజు మ్యాక్స్‌వెల్ అమ్ముడుపోలేదు. కానీ రెండో రోజు అతడిని పంజాబ్ కింగ్స్ 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమయ్యాడు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 135 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ 2771 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 38 వికెట్లు తీసుకున్నాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిరాశపరిచినా ఈ మ్యాచ్‌లో మాత్రం పంజాబ్ కింగ్స్ గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 97, ప్రియాన్స్ ఆర్య 47 పరుగులతో ఆకట్టుకోగా...చివరలో శశాంక్ సింగ్ (44 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో పంజాబ్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గట్టిగానే పోరాడిన గుజరాత్ 232 పరుగులు చేసింది. 11 పరుగులతో ఓటమి పాలైంది. సాయిసుదర్శన్ (74 రన్స్), జోస్ బట్లర్ (54 పరుగులు)తో పాటు రూథర్‌ఫోర్డ్ 46 రన్స్‌తో పోరాడిన గుజరాత్‌కు ఓటమి తప్పలేదు.
సంబంధిత కథనం