T20 World Cup: టీ20 వరల్డ్ క‌ప్‌లో ఇత‌ర దేశాల త‌ర‌ఫున ఆడుతోన్న భార‌త క్రికెట‌ర్లు ఎవ‌రంటే?-monank patel to rachin ravindra full list of indian origin players in t20 world cup ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup: టీ20 వరల్డ్ క‌ప్‌లో ఇత‌ర దేశాల త‌ర‌ఫున ఆడుతోన్న భార‌త క్రికెట‌ర్లు ఎవ‌రంటే?

T20 World Cup: టీ20 వరల్డ్ క‌ప్‌లో ఇత‌ర దేశాల త‌ర‌ఫున ఆడుతోన్న భార‌త క్రికెట‌ర్లు ఎవ‌రంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 01, 2024 12:39 PM IST

T20 World Cup: ఈ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో వివిధ దేశాల త‌ర‌ఫున ప‌లువురు భార‌త సంత‌తి క్రికెట‌ర్లు బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అమెరికా నుంచి ఎనిమిది మంది, ఉగాండ‌, కెనాడ నుంచి న‌లుగురేసి భార‌త క్రికెట‌ర్లు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోతున్నారు.

యూఎస్ఏ క్రికెట్ టీమ్‌
యూఎస్ఏ క్రికెట్ టీమ్‌

T20 World Cup: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌రం మ‌రో రోజులో మొద‌లుకాబోతుంది. జూన్ 2 నుంచి జూన్ 29 వ‌ర‌కు క్రికెట్ అభిమానుల‌ను వ‌ర‌ల్డ్ క‌ప్ అల‌రించ‌నుంది. ఈ పొట్టి ప్ర‌పంచ క‌ప్ కోసం ఇర‌వై దేశాలు పోటీప‌డ‌బోతున్నాయి. ఒక్కో గ్రూప్‌లో ఐదు దేశాల చొప్పున మొత్తం నాలుగు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్థాన్‌తో పాటు యూఎస్ఏ, కెన‌డా, ఐర్లాండ్ ఉన్నాయి. కాగా ఈ సారి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియాక‌కు ప్ర‌త్య‌ర్థులుగా వివిధ దేశాల త‌ర‌ఫున ప‌లువురు భార‌త క్రికెట‌ర్లు బ‌రిలోకి దిగ‌బోతున్నారు.

ఈ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆతిథ్య దేశం హోదాలో తొలిసారి యూఎస్ఏ బ‌రిలో దిగుతోంది. యూఎస్ఏ టీమ్‌లో ఎనిమిది మంది భార‌త సంత‌తి క్రికెట‌ర్లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

మోనాంక్ ప‌టేల్ గుజ‌రాత్‌...

అమెరికా క్రికెట్ టీమ్ కెప్టెన్ మోనాంక్ ప‌టేల్ గుజ‌రాత్‌లోనే పుట్టిపెరిగాడు. గుజ‌రాత్ త‌ర‌ఫున అండ‌ర్ 16, అండ‌ర్ 18 మ్యాచ్‌లు ఆడాడు. ఆ త‌ర్వాత మోనాంక్ ప‌టేల్‌ కుటుంబం అమెరికాకు వ‌ల‌స వెళ్ల‌డంతో ఆ దేశం త‌ర‌ఫున క్రికెట్ ఆడుతోన్నాడు. యూఎస్ఏ పేస‌ర్ హ‌ర్మీత్ సింగ్ టీమిండియా త‌ర‌ఫున అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడాడు. ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఈ సారి టీమిండియాకు ప్ర‌త్య‌ర్థితో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోతున్నాడు.

వీరితో పాటు భార‌త సంత‌తికి చెందిన మిలింద్ కుమార్‌, జెస్సీ సింగ్‌, నిస‌ర్గ్ ప‌టేల్, నితీష్ కుమార్‌, నౌష‌త్ కెంజిగే, సౌర‌భ్ నేత్ర‌వాల్క‌ర్‌ కూడా యూఎస్ఏ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్‌లో చోటు ద‌క్కించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది భార‌త సంత‌తి ప్లేయ‌ర్లు అమెరికా త‌ర‌ఫున టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోతున్నారు. ఈ ఎనిమిది మంది వివిధ రాష్ట్రాల తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. అవకాశాలు రాకపోవడంతో అమెరికా టీమ్ కు ఆడుతోన్నారు.

కెన‌డా నుంచి న‌లుగురు...

కెన‌డా త‌ర‌ఫున న‌లుగురు భార‌త క్రికెట‌ర్లు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోతున్నారు. ర‌వీంద‌ర్‌పాల్ సింగ్‌, నిఖిల్ ద‌త్తా, శ్రేయ‌స్ మొవ్వా, ప‌ర్గాట్ సింగ్ భార‌త దేశంలోనే పుట్టి కెన‌డా జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్నారు.

భార‌త ప్లేయ‌ర్ క‌శ్య‌ప్ ప్ర‌జాప‌తి ఓమ‌న్ త‌ర‌ఫున టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో బ‌రిలోకి దిగుతోన్నాడు. ఉగాండా టీమ్‌లోని దినేష్ న‌క్రానీ, రోనాంక్ ప‌టేల్‌, ఆల్ఫేష్ రంజానీ ఇండియాలోనే జ‌న్మించారు. ఉగాండా క్రికెట్ ఫ్యాన్స్ ఈ ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఉగాండా కోచ్ కూడా టీమిండియా క్రికెటర్ కావడం గమనార్హం.

తెలుగు ఆట‌గాడు..

ఐర్లాండ్ క్రికెటర్ తేజ నిడ‌మ‌నూరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడు కావడం గమనార్హం. ఐర్లాండ్ జట్టులో కీలకమైన ప్లేయర్ గా చాలా కాలంగా తేజ కొనసాగుతోన్నాడు. న్యూజిలాండ్‌లోని ర‌చిన్ ర‌వీంద్ర‌, సౌతాఫ్రికా క్రికెట‌ర్ కేశ‌వ్ మ‌హారాజ్ తో పాటు మ‌రికొంత మంది భార‌త సంత‌తి క్రికెట‌ర్లు ఈ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోతున్నారు. వీరిలో ఎంతమంది టీమిండియా క్రికెటర్లు మెరుస్తారో చూడాల్సిందే.

టీ20 వరల్డ్ కప్ 2024