Siraj Bowling Speed: ఆస్ట్రేలియా గడ్డపై గంటకి 181.6కిమీ వేగంతో బంతిని విసిరిన సిరాజ్.. ట్విస్ట్ ఏంటంటే?-mohammed siraj bowls 181 6 kmph speed gun goes horribly wrong in ind vs aus 2nd test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Siraj Bowling Speed: ఆస్ట్రేలియా గడ్డపై గంటకి 181.6కిమీ వేగంతో బంతిని విసిరిన సిరాజ్.. ట్విస్ట్ ఏంటంటే?

Siraj Bowling Speed: ఆస్ట్రేలియా గడ్డపై గంటకి 181.6కిమీ వేగంతో బంతిని విసిరిన సిరాజ్.. ట్విస్ట్ ఏంటంటే?

Galeti Rajendra HT Telugu
Dec 06, 2024 09:05 PM IST

Mohammed Siraj bowls 181.6 kmph: ఆస్ట్రేలియా బ్యాటర్ మార్కస్ లబుషేన్ చేసిన పనికి కోపంతో ఊగిపోయిన మహ్మద్ సిరాజ్.. వికెట్లకి గురిపెట్టి బంతిని విసిరాడు. ఆ బంతిని లబుషేన్ టచ్ చేయలేదు.. నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. ఈ క్రమంలో..?

మహ్మద్ సిరాజ్
మహ్మద్ సిరాజ్ (AP)

ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గంటకి 181.6 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరినట్లు వార్త వెలుగులోకి రాగానే క్రికెట్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. అడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన పింక్ బాల్‌ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 180 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటవగా.. ఈరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 86/1తో నిలిచింది.

yearly horoscope entry point

ఈరోజు తొలి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్ 29 పరుగులు ఇచ్చాడు. కానీ.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే.. ఈ 10 ఓవర్లలో మూడు మెయిడిన్ అయ్యాయి. ఈ క్రమంలో సిరాజ్ ఒక బంతిని గంటకి 181.6కిమీ వేగంతో విసిరినట్లు లైవ్‌లో చూపించారు. దాంతో ఇది నిజమా? అంటూ నెటిజన్లు తెగ శోధిస్తున్నారు.

క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డ్ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. అతను గంటకి 161.3 కిమీ వేగంతో బంతిని విసిరాడు. అయితే.. మహ్మద్ సిరాజ్ ఇప్పటి వరకూ గంటకి సగటున 135-145కిమీ వేగంతో మాత్రమే బంతులు వేస్తూ వచ్చాడు. అయితే.. సడన్‌గా అతను 181.6 వేగంతో బంతులు వేయడమేంటి? అని అందరూ ఆశ్చర్యపోయారు.

వాస్తవం ఏంటంటే? ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని విసిరేందుకు రనప్‌తో వేగంగా రాగా.. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మార్కస్ లబుషేన్ సైట్ స్క్రీన్ వద్ద ప్రేక్షకుడు పైపుని తీసుకుని నడవడంతో ఏకాగ్రత చెదిరి బంతిని ఎదుర్కోకుండా వెనక్కి వెళ్లాడు. దాంతో అప్పటికే దాదాపు బంతిని విసిరేందుకు సిద్ధమైన సిరాజ్ బౌలింగ్‌ను ఆఖరి క్షణంలో ఆపేసినా.. కోపం చల్లారక త్రో రూపంలో బంతిని వికెట్లపైకి విసిరాడు. దాంతో ఆ బంతి వేగం సాంకేతిక లోపం కారణంగా గంటకు 181.6 కిమీతో నమోదైంది. సిరాజ్ స్పీడ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.

Whats_app_banner