Mohammed Shami: షమి ఫిట్‌గానే ఉన్నాడు కానీ..: మూడో టీ20కి ముందు ట్విస్ట్ ఇచ్చిన టీమిండియా బ్యాటింగ్ కోచ్
Mohammed Shami: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి ఫిట్ గానే ఉన్నాడని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించాడు. ఇంగ్లండ్ తో మంగళవారం (జనవరి 28) రాజ్‌కోట్ లో మూడో టీ20 జరగనున్న విషయం తెలిసిందే.
Mohammed Shami: మహ్మద్ షమి గాయంతో ఏడాదికిపైగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు అతన్ని ఎంపిక చేసినా.. తొలి రెండు టీ20ల్లో ఆడించలేదు. మరి మూడో మ్యాచ్ లో అయినా అతడు ఆడతాడా అనే ప్రశ్నకు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అతడు ఫిట్ గా ఉన్నాడని చెప్పినా.. తుది నిర్ణయం మాత్రం గంభీర్, సూర్యలదే అని అన్నాడు.

షమి ఫిట్‌గానే ఉన్నాడు: సితాన్షు కోటక్
ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టీ20కి అంతా సిద్ధమైంది. అయితే ఈ సిరీస్ కోసం జట్టులోకి వచ్చిన పేస్ బౌలర్ మహ్మద్ షమిని తొలి రెండు మ్యాచ్ లకు తీసుకోకపోవడంతో అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాత్రం అతడు ఫిట్ గా ఉన్నట్లు స్పష్టం చేశాడు. అతన్ని ఆడించడానికి ఫిట్‌నెస్ సమస్య కాదని కోటక్ అన్నాడు.
"షమి ఫిట్ గానే ఉన్నాడు. అతడు జట్టులో ఉంటాడా లేదా అన్నది నేను చెప్పలేను. కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యలదే తుది నిర్ణయం. అతనిపై భారం ఎలా మోపుతారన్నది చూడాలి. ఫిట్‌నెస్ అయితే సమస్య కాదు" అని కోటక్ తేల్చి చెప్పాడు.
షమి ఫిట్‌గానే ఉన్నా.. తొలి రెండు మ్యాచ్ లకు అతన్ని ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. దీనిపై గంభీర్, సూర్యలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కోటక్ ఇచ్చిన ట్విస్టుతో వాళ్లు మరింత ఇరుకునపడ్డారు. షమిని ఎంపిక చేసినా తుది జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.
రాజ్‌కోట్‌లో పరుగుల వరదే
ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగబోయే మూడో టీ20కి ఆతిథ్యమిచ్చే రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమని, ఇక్కడ పరుగుల వరద ఖాయమని కూడా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ అన్నాడు. టీమ్ లో ఒక్కో బ్యాటర్ కు ఒక్కో ప్లాన్ ఉంటుందని, అందుకు తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉంటుందని అతడు చెప్పాడు.
"ఇంగ్లండ్ కూడా కొన్ని ప్లాన్స్ తో వస్తుంది. వాళ్లు కూడా కొన్ని ఏరియాలు లక్ష్యంగా బౌలింగ్ చేయాలనుకుంటారు. అందుకు తగినట్లుగా బ్యాటర్లు రియాక్ట్ అవుతారు. ఇది ప్రతి టీమ్ చేసేదే. మేం కూడా అదే చేస్తున్నాం" అని కోటక్ అన్నాడు.
ఈ మూడో టీ20 కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించగా.. టీమిండియా మాత్రం టాస్ సందర్భంగానే వెల్లడించనుంది. మరి ఈ మ్యాచ్ లో అయినా ఫిట్ గా ఉన్న మహ్మద్ షమికి అవకాశం దక్కుతుందా లేక విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగిస్తారా అన్నది చూడాలి.
సంబంధిత కథనం