వారెవా.. మిచెల్ మార్ష్. ప్లేఆఫ్స్ రేసుకు దూరమై నిరాశలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు ఈ బ్యాటర్ జోష్ అందించాడు. గురువారం (మే 22) అహ్మదాబాద్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పై సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.
మిచెల్ మార్ష్ (64 బంతుల్లో 117; 10 ఫోర్లు, 8 సిక్సర్లు)తో పాటు నికోలస్ పూరన్ (27 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 235 పరుగులు సాధించింది.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ లో మిచెల్ మార్ష్ ఆటే హైలైట్. సూపర్ ఫామ్ లో ఉన్న ఈ ఆస్ట్రేలియా ఆటగాడు అహ్మదాబాద్ గ్రౌండ్ లో చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఐడెన్ మార్ క్రమ్ (36), మార్ష్ కలిసి గుజరాత్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ ఓపెనింగ్ జోడీ తొలి వికెట్ కు 9.5 ఓవర్లలోనే 91 పరుగులు జోడించింది.
మార్ క్రమ్ ను ఔట్ చేసి ఫస్ట్ వికెట్ పార్ట్ నర్ షిప్ ను సాయి కిశోర్ బ్రేక్ చేశాడు. కానీ వికెట్ పడ్డా మిచెల్ మార్ష్ దంచుడు ఆపలేదు. అప్పటికే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న మార్ష్ ఆ తర్వాత మరింతగా చెలరేగిపోయాడు. కచ్చితమైన టైమింగ్ తో భారీ షాట్లు ఆడాడు.
రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఈ స్టార్ స్పిన్నర్ బౌలింగ్ లో బౌండరీల మోత మోగించాడు. వరుసగా 6, 4, 6, 4, 4 కొట్టాడు మార్ష్. లాస్ట్ బాల్ కు సింగిల్ తీశాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి.
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ చివర్లో పూరన్, మార్ష్ కలిసి గుజరాత్ బౌలింగ్ ను తుత్తునియలు చేశారు. సిరాజ్ ఓవర్లో మార్ష్ ఫోర్ కొడితే.. పూరన్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ దంచాడు. ఆ వెంటనే మార్ష్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఐపీఎల్ లో ఫస్ట్ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు పూరన్ కూడా ఫిఫ్టీ చేరుకున్నాడు.
సెంచరీ తర్వాత కూడా మార్ష్ దూకుడు కొనసాగించాడు. ప్రసిద్ధ్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. చివరకు అతణ్ని అర్షద్ పెవిలియన్ చేర్చాడు. చివరి ఓవర్లో పంత్ రెండు సిక్సర్లు కొట్టడంతో టీమ్ స్కోరు 230 దాటింది.
సంబంధిత కథనం