MI vs RR Highlights: రోహిత్‌ను భయపెట్టిన అభిమాని.. చెత్త రికార్డు మూటగట్టుకున్న మాజీ కెప్టెన్.. ఫ్యాన్స్‌ను వేడుకుంటూ..-mi vs rr highlights rohit sharma duck outs record a fan scared him during the match rohit urges fans not to boo hardik ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mi Vs Rr Highlights: రోహిత్‌ను భయపెట్టిన అభిమాని.. చెత్త రికార్డు మూటగట్టుకున్న మాజీ కెప్టెన్.. ఫ్యాన్స్‌ను వేడుకుంటూ..

MI vs RR Highlights: రోహిత్‌ను భయపెట్టిన అభిమాని.. చెత్త రికార్డు మూటగట్టుకున్న మాజీ కెప్టెన్.. ఫ్యాన్స్‌ను వేడుకుంటూ..

Hari Prasad S HT Telugu
Published Apr 02, 2024 07:09 AM IST

MI vs RR Highlights: ముంబై ఇండియన్స్ కు హ్యాట్రిక్ ఓటములు తప్పలేదు. అయితే ఈ మ్యాచ్ అంతా రోహిత్ శర్మ చుట్టే తిరిగింది. అతన్ని ఓ అభిమాని భయపెట్టగా.. ఐపీఎల్లో మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు.

రోహిత్‌ను భయపెట్టిన అభిమాని.. చెత్త రికార్డు మూటగట్టుకున్న మాజీ కెప్టెన్.. ఫ్యాన్స్‌ను వేడుకుంటూ..
రోహిత్‌ను భయపెట్టిన అభిమాని.. చెత్త రికార్డు మూటగట్టుకున్న మాజీ కెప్టెన్.. ఫ్యాన్స్‌ను వేడుకుంటూ..

MI vs RR Highlights: ముంబై ఇండియన్స్ కు సొంత మైదానం కూడా కలిసి రాలేదు. ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ ఓటములు తప్పలేదు. రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓటమితో ఆ టీమ్ పాయింట్ల టేబుల్లో చివరిస్థానానికి పడిపోయింది.

అయితే ఈ మ్యాచ్ లో గ్రౌండ్లోకి దూసుకొచ్చిన ఓ అభిమాని.. రోహిత్ ను భయటపెట్టగా.. ఆ తర్వాత బ్యాటింగ్ లో అతడు మరో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇక హార్దిక్ ను హేళన చేస్తున్న అభిమానులను అలా చేయొద్దంటూ వేడుకున్నాడు.

రోహిత్‌ను భయపెట్టిన అభిమాని

రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అభిమాని భయపెట్టాడు. సెక్యూరిటీ కళ్లుగప్పి గ్రౌండ్లోకి దూసుకొచ్చిన అతడు.. స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ వైపు వెనుక నుంచి దూసుకెళ్లాడు. సడెన్ గా వెనుక నుంచి వచ్చిన అతన్ని చూసి రోహిత్ ఉలిక్కిపడ్డాడు. అయితే ఆ అభిమాని మాత్రం రోహిత్ ను గట్టిగా హగ్ చేసుకున్నాడు.

ఆ తర్వాత పక్కనే ఉన్న ఇషాన్ కిషన్ ను కూడా అలాగే హగ్ చేసుకున్నాడు. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. ఆ అభిమానిని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. మొన్న విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని ఇలాగే దూసుకురాగా.. అతన్ని బయటకు తీసుకెళ్లిన సిబ్బంది చితక బాదిన వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

రోహిత్ పేరిట చెత్త రికార్డు

రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్ లో అతడు తొలి బంతికే ఔటైన మరో గోల్డెన్ డకౌట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. తమ ఫేవరెట్ కెప్టెన్ డకౌట్ కావడంతో వాంఖెడే స్టేడియం మొత్తం తొలి ఓవర్లోనే మూగబోయింది.

దీంతో ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌటైన ప్లేయర్ గా రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మెగా లీగ్ లో రోహిత్ 17వసారి డకౌటయ్యాడు. దినేష్ కార్తీక్ పేరుతో ఉన్న రికార్డును అతడు సమం చేశాడు. ఈ లిస్ట్ లో తర్వాతి స్థానాల్లో 16 డకౌట్లతో పియూష్ చావ్లా, మ్యాక్స్‌వెల్, మణ్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు.

అభిమానులను వేడుకున్న రోహిత్

ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఎక్కడికెళ్లినా అభిమానుల నుంచి హేళన తప్పడం లేదు. సొంత మైదానం వాంఖెడేలోనూ అదే జరిగింది. టాస్ సందర్భంగానే ప్రేక్షకులు హార్దిక్ ను హేళన చేయడంతో అది సరికాదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ నేరుగానే వార్నింగ్ ఇచ్చాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ వాళ్లు అలాగే చేశారు.

దీంతో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అలా చేయొద్దని అభిమానులను వేడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అలా హేళన చేయొద్దని రోహిత్ తన చేతులతో అభిమానులకు సైగ చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. అయితే ముంబై హ్యాట్రిక్ ఓటములతో హార్దిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో రానున్న మ్యాచ్ లలో అతడు మరింత ఆగ్రహాన్ని చవిచూడటం ఖాయంగా కనిపిస్తోంది.

Whats_app_banner