MI vs RCB: ముంబై, బెంగళూరు మ్యాచ్: ఫ్యాన్స్ గ్రౌండ్‍లోకి దూసుకురాకుండా వాంఖడేలో ప్రత్యేక జాగ్రత్తలు: ఏం చేస్తున్నారంటే..
MI vs RCB IPL 2024: ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రేపు (ఏప్రిల్ 11) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‍లో ఫ్యాన్స్ ఎవరూ మైదానంలోకి దూసుకురాకుండా వాంఖడే స్టేడియం జాగ్రత్తలు తీసుకుంటోంది.
MI vs RCB IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ బిగ్ క్లాష్ రేపు (ఏప్రిల్ 11) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ (ముంబై), విరాట్ కోహ్లీ (ఆర్సీబీ) ఒకే మ్యాచ్‍లో తలపడుతుంటంతో వాంఖడే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని కలిసేందుకు స్టాండ్స్ నుంచి మైదానంలోకి ఫ్యాన్స్ దూసుకురాకుండా చర్యలు తీసుకుంటోంది. ఆ వివరాలివే..

ఐపీఎల్ 2024 సీజన్‍లో మ్యాచ్‍లు జరుగుతుండగా కొన్ని సందర్భాల్లో మైదానంలోకి కొందరు వచ్చేశారు. వాంఖడేలో ఏప్రిల్ 1న జరిగిన మ్యాచ్‍లో ముంబై మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను కలిసేందుకు ఓ అభిమాని.. స్టాండ్స్ నుంచి ఫెన్సింగ్ దూకి మైదానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్ వద్దకు వెళ్లాడు. అలాగే, జైపూర్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ వద్దకు కూడా ఓ అభిమాని దూసుకొచ్చాడు. అయితే, ఇలాంటి ఘటనలు జరగకుండా నివారించేందుకు వాంఖడే స్టేడియం జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఫెన్సింగ్‍కు మేకులు
ముంబై, బెంగళూరు మధ్య రేపు (మార్చి 11) జరగనున్న మ్యాచ్‍లో ఫ్యాన్స్ ఎవరూ స్టాండ్స్ నుంచి గ్రౌండ్‍లోకి ప్రవేశించకుండా ఫెన్సింగ్‍ను మరింత కట్టుదిట్టం చేస్తోంది వాంఖడే. ఫెన్సింగ్ పైనుంచి దూకేందుకు ఎవరూ ప్రయత్నించకుండా వాటి పైభాగంలో మేకులను ఏర్పాటు చేయిస్తోంది. పదునుగా ఉండే కారణంగా కంచె పైనుంచి ఎవరూ దూకే సాహసం చేయరని భావిస్తోంది. మరి, ఈ చర్య ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
ముంబై, బెంగళూరు ఒకేలా..
ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన చేశాయి. ఐదు మ్యాచ్‍ల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి.. నాలుగింట ఓడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్ లాంటి స్టార్లు ఉన్నా గెలువలేకపోతోంది. విరాట్ కోహ్లీ మినహా మరెవరూ బ్యాటింగ్‍లో సత్తాచాటలేకపోతున్నారు. బౌలింగ్‍లోనూ తేలిపోతోంది.
ముంబై ఇండియన్స్ కూడా ఈ సీజన్‍లో ఇబ్బందుల్లో ఉంది. తొలి మూడు మ్యాచ్‍ల్లో ఓడిన ముంబై.. ఎట్టకేలకు నాలుగో మ్యాచ్‍లో బోణీ కొట్టింది. ఈ సీజన్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను ముంబై ఫ్రాంచైజీ అప్పగించింది. ఈ విషయంలో ముంబై అభిమానులు అసంతృప్తిగా ఉండగా.. దీనికి తోడు మూడు మ్యాచ్‍ల్లో ఆ జట్టు ఓడింది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన గత మ్యాచ్‍లో ముంబై విజయం సాధించి.. ఊపిరి పీల్చుకుంది. ఎట్టకేలకు బోణీ కొట్టింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, 9వ ప్లేస్‍లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు రేపటి (ఏప్రిల్ 11) మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‍లో గెలిచి పట్టికలో పైకి ఎగబాకాలని రెండు జట్లు కసిగా ఉన్నాయి.
ముంబై, బెంగళూరు హెడ్ టూ హెడ్
ఐపీఎల్‍లో ఇప్పటి వరకు ముంబై, బెంగళూరు పరస్పరం 32సార్లు తలపడ్డాయి. వీటిలో ముంబై 18సార్లు గెలువగా.. బెంగళూరు 14 మ్యాచ్‍ల్లో విజయం సాధించింది. హెడ్ టూ హెడ్‍లో ముంబైదే పైచేయిగా ఉంది.