MI vs KKR Live Score: చెలరేగిన ముంబై బౌలర్లు.. కోల్‌కతాను ఆదుకున్న వెంకటేశ్ అయ్యర్.. టార్గెట్ ఎంతంటే?
MI vs KKR Live Score: సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీతో కేకేఆర్ ను ఆదుకున్నాడు.
MI vs KKR Live Score: ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్లు చెలరేగారు. బుమ్రా, తుషార మూడేసి వికెట్లు తీయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్ మాత్రమే 70 పరుగులతో రాణించాడు. దీంతో కేకేఆర్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
చెలరేగిన బుమ్రా, తుషార
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ముంబై ఇండియన్స్. ఈ సీజన్లో చెలరేగిపోతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లకు ముంబై బౌలర్లు చెక్ పెట్టారు. నువాన్ తుషార మొదట్లోనే ముంబైని దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ (5) ఔటయ్యాడు. ఆ తర్వాత రఘువంశీ (13), శ్రేయస్ అయ్యర్ (6), సునీల్ నరైన్ (8), రింకు సింగ్ (9) ఔటయ్యారు.
దీంతో కోల్‌కతా 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలోనే తుషార మూడు వికెట్లు తీశాడు. అతనికి బుమ్రా కూడా తోడవడంతో కేకేఆర్ కష్టాల్లో పడింది. తుషార 4 ఓవర్లలో 42 పరుగులకు 3 వికెట్లు, బుమ్రా 3.5 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. హార్దిక్ పాండ్యా 2, పియూష్ చావ్లా ఒక వికెట్ తీశారు.
ఆదుకున్న వెంకటేశ్ అయ్యర్, మనీష్ పాండే
57 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఈ మాత్రం స్కోరైనా సాధించిందంటే దానికి కారణం వెంకటేశ్ అయ్యర్, మనీష్ పాండే. ఈ ఇద్దరూ ఆరో వికెట్ కు 83 పరుగులు జోడించారు. మనీష్ పాండే 31 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 42 రన్స్ చేశాడు. వెంకటేశ్ మాత్రం హాఫ్ సెంచరీ చేశాడు. చివరికి అతడు 52 బంతుల్లోనే 70 రన్స్ చేశాడు.
అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. అయితే రాత్రిపూట మంచు ప్రభావం ఉండటంతో 170 పరుగుల లక్ష్యం ముంబైకి అంత కష్టమేమీ కాకపోవచ్చు. ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో కేకేఆర్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఓడినా ఆ టీమ్ స్థానంలో మార్పు రాకపోయినా.. ప్లేఆఫ్స్ చేరడానికి మరింత సమయం పట్టవచ్చు.