ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరపున దారుణమైన ప్రదర్శన చేసిన మ్యాక్స్‌వెల్.. అమెరికాలో మాత్రం అదరగొట్టాడు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) టోర్నీలో మెరుపు సెంచరీతో చెలరేగాడు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ కొలీజియంలో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌పై అద్భుతమైన హండ్రెడ్ బాదేశాడు. బుధవారం (జూన్ 18) వాషింగ్టన్ ఫ్రీడం టీమ్ తరపున మైదానంలో సునామీ తెప్పించాడు.
మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో మ్యాక్స్‌వెల్ ఫస్ట్ హండ్రెడ్ సాధించాడు. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఏకంగా 13 సిక్సర్లు బాదాడు. 36 ఏళ్ల ఈ ఆటగాడు ఇటీవల వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే కాలిఫోర్నియాలోని అభిమానులకు మాత్రం స్పెషల్ ఇన్నింగ్స్ తో పరుగుల విందు అందించాడు. మాక్స్‌వెల్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో వాషింగ్టన్ ఫ్రీడమ్ బుధవారం జరిగిన ఎంఎల్సీ మ్యాచ్‌లో భారీ స్కోరును నమోదు చేసింది.
వాషింగ్టన్ ఫ్రీడం ఇన్నింగ్స్ లో మ్యాక్స్‌వెల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. స్లోగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. తొలి 15 బంతుల్లో 11 పరుగులే చేశాడు. కానీ తన్వీర్ సంఘా వేసిన 14వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాక్సీ టాప్ గేరులోకి వచ్చేశాడు. ఆ తర్వాత బాల్ గ్రౌండ్ లో కనబడలేదంతే! ఎక్కువగా గాల్లోనే తేలింది.
36 ఏళ్ల మ్యాక్స్‌వెల్ తొలుత 15 బంతుల్లో 11 పరుగులు చేసి ఆ తర్వాత గేర్ మార్చి తర్వాతి 37 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ లో ఓవరాల్ గా 49 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఇందులో 13 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.
మ్యాక్స్‌వెల్ దంచుడుతో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫస్ట్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 49 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్ 20 ఓవర్లలో 208/5 పరుగులు చేసింది. ఛేజింగ్ లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ 16.3 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ ఓవెన్, జాక్ ఎడ్వర్డ్స్ మూడు చొప్పున వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 113 పరుగుల తేడాతో గెలిచింది.
"కొంచెం భిన్నమైన పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చా. వేరుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. చాలా నెమ్మదిగా ప్రారంభించా. కానీ మాకు కొన్ని పరుగులు అవసరమని నేను అనుకున్న తర్వాత నా షాట్లు ఆడాను. అది ఫలితం ఇచ్చింది. ఆ సమయంలో బ్యాటింగ్ చేయడం అవసరం. వారు (అతని తల్లిదండ్రులు) నేను పరుగులు చేయడాన్ని లైవ్ గా చూడటం సంతోషంగా ఉంది." అని మ్యాక్స్‌వెల్ బ్రాడ్‌కాస్టర్‌లతో చెప్పాడు. ఐపీఎల్ 2025లో 6 ఇన్నింగ్స్ లో 48 పరుగులే చేశాడు.
సంబంధిత కథనం