Shoaib Malik: షోయబ్ మాలిక్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు - బీపీఎల్ కాంట్రాక్ట్ రద్దు
Shoaib Malik: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆడుతోన్న షోయబ్ ఓ మ్యాచ్‌లో మూడు నో బాల్స్ కావాలనే వేయడం అనుమానాలను రేకెత్తిస్తోంది.
Shoaib Malik పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చిక్కుల్లో పడ్డాడు. అతడిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నమోదయ్యాయి. . ఈ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా అతడి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కాంట్రాక్ట్ రద్ధయింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షోయమ్ మాలిక్ ఫార్చ్యూన్ బరీషాన్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇటీవల ఫార్భ్యూన్ బరీషాన్, ఖుల్నా టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో ఒకే ఒక ఓవర్ వేసిన షోయబ్ మాలిక్ 18 రన్స్ ఇచ్చాడు. మాలిక్ వేసిన ఈ ఓవర్‌లో ఎవిన్ లూయిస్ ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టాడు. మూడు నోబాల్స్ సహ మొత్తం 18 రన్స్ రావడంతో ఫార్చ్యూన్ బరీషాన్ ఖుల్నా టైగర్ విజయం తేలికైంది. ఈ మ్యాచ్‌లోఫార్చ్యూన్ బరీషాన్ 187 పరుగులు చేయగా మరో రెండు ఓవర్లు మిగిలుండగానే ఖుల్నా టైగర్స్ టార్గెట్‌ను ఛేధించింది.
ఈ మ్యాచ్‌లో షోయబ్ వేసిన ఓవర్ వివాదాస్పదంగా మారింది. షోయబ్ మూడు నోబాల్స్ కావాలనే వేసినట్లుగా ఉన్నాయంటూ ఎంపైర్స్‌తో పాటు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. భారీగా పరుగులు ఇవ్వాలన్నట్లుగానే అతడు బౌలింగ్ చేసిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిక్సింగ్ ఆరోపణలు...
ఈ అనుమానాల నేపథ్యంలో అతడిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలకు సంబంధించి నిజానిజాలను తేల్చే పనిలో బంగ్లాదేశ్ క్రికెట్ అసోషియేషన్ పడింది. అప్పటివరకు షోయబ్ మాలిక్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కాంట్రాక్ట్‌ను రద్ధు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆరోపణలు అబద్ధమని తేలిన తర్వాత అతడి కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ ఆరోపణలతో బీపీఎల్ నుంచి షోయబ్ మాలిక్ మధ్యలోనే వైదొలిగాడు. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే ఇంటర్‌నేషనల్ క్రికెట్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయి. గతంలో 2010లో పాక్ క్రికెట్ బోర్డ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు షోయబ్.
సానియా మీర్జాతో విడాకులు...
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు విడాకులు ఇచ్చిన షోయబ్ మాలిక్ ఇటీవలే పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను పెళ్లాడాడు. షోయబ్ మాలిక్‌కు ఇది మూడో వివాహం. అయేషా సిద్ధిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్ 2010లో సానియా మీర్జాను పెళ్లాడాడు. దాదాపు పదమూడేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా వీరి కాపురం సాగింది. మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోయినట్లు సమాచారం. అయితే విడాకులపై ఇప్పటివరకు సానియా, షోయబ్ పెదవి విప్పలేదు.
ఫస్ట్ పోస్ట్...
షోయబ్‌తో విడాకుల తర్వాత తొలిసారి సానియా మీర్జా సోషల్ మీడియాలో కనిపించింది. అద్ధంలో తనను తాను చూసుకుంటున్న ఆ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో స్పోర్ట్స్ జాకెట్ ధరించి సానియా కనిపిస్తోంది. ఈ ఫొటోకు రిఫ్లెక్ట్ అంటూ క్యాప్షన్ జోడించింది. విడాకుల తర్వాత జీవితం అంటే ఏమిటో తెలిసింది అనే అర్థం వచ్చేలా ఆమె ఈ కామెంట్ పెట్టిందని నెటిజన్లు చెబుతోన్నారు.