భారత మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కోచ్ గా నియమిస్తే టీమిండియాను తిరుగులేని శక్తిగా మారుస్తానని ఆయన చెప్పారు. జట్టులోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను రక్షించి, వారికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఇటీవల భారత మాజీ క్రికెటర్ తరుణ్ కోహ్లీతో 'ఫైండ్ ఏ వే' పాడ్‌కాస్ట్‌లో యోగరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“మీరు నన్ను భారత జట్టు కోచ్‌గా చేస్తే, ఈ ఆటగాళ్లనే ఉపయోగించి దీన్ని ఎప్పటికీ ఓడించలేని జట్టుగా మారుస్తాను. వారి సామర్థ్యాలను ఎవరు బయటకు తీస్తారు? ఎందుకంటే వాళ్లను జట్టు నుండి తొలగించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. రోహిత్ శర్మను లేదా కోహ్లీని డ్రాప్ చేస్తారు. కానీ ఎందుకు? వారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను మీతోనే ఉన్నానని నా పిల్లల్లాంటి వాళ్లకు చెప్పాలనుకుంటా’’ అని యోగరాజ్ పేర్కొన్నారు.
‘‘వారిని రంజీ ట్రోఫీలో ఆడిద్దాం. లేదా రోహిత్ ను రోజు 20 కిలోమీటర్లు పరుగెత్తమని చెప్తా. కానీ ఇంకెవరూ అలా చేయడం లేదు. ఈ ఆటగాళ్ళు వజ్రాలు. వారిని తొలగించకండి. నేను వారి తండ్రిలా ఉంటాను. యువరాజ్, ఇతరుల మధ్య నేను ఎప్పుడూ తేడా చూపలేదు. ధోనీని కూడా ఏమి అనలేదు. కానీ తప్పును తప్పే అని చెప్తా’’ అని ఆయన అన్నారు.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచింది. గతేడాది టీ20 ప్రపంచకప్ నూ సొంతం చేసుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం వరుసగా ఫెయిల్ అవుతోంది. 2024లో సొంతగడ్డపై న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను 0-3తో కోల్పోయింది. స్వదేశంలో తొలిసారి టెస్టు సిరీస్ లో వైట్ వాష్ కు గురై అవమానం ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ సిరీస్ కోల్పోయింది.
2024 టీ20 ప్రపంచకప్ విక్టరీ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డేల్లో మాత్రం నిలకడ కొనసాగిస్తున్నారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై విరాట్ హీరోచిత సెంచరీ చేశాడు. ఫైనల్లో రోహిత్ 76 రన్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ టెస్టుల్లో మాత్రం వీళ్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా.. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 2007 నుంచి భారత్ టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ సిరీస్ రోహిత్, కోహ్లికి పరీక్షగా నిలవనుంది.
పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. భారత టెస్ట్ జట్టులోని కొంతమంది ముఖ్య ఆటగాళ్లను లయన్స్‌తో జరిగే రెండు నాలుగు రోజుల పర్యటన మ్యాచ్‌ల కోసం ఇండియా-ఎ జట్టులో చేర్చవచ్చు. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవడానికి ఈ పర్యటన మ్యాచ్‌లు జరుగుతాయి.
ఐపీఎల్ ఫైనల్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత, మే 30న ఈ టూర్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ప్లేఆఫ్స్ ప్రారంభానికి ముందు ఏ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారనే దాని ఆధారంగా జట్టును ఎంపిక చేస్తారు.
సంబంధిత కథనం