ఐపీఎల్ 2025లో మరో టీమ్ ప్లేఆఫ్స్ కు దూరమైంది. ఈ సీజన్ లో తడబడుతూ సాగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. సోమవారం (మే 19) డూ ఆర్ డై మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో 6 వికెట్ల తేడాతో ఓడింది. హోం గ్రౌండ్ లో బొక్కబోర్లా పడింది. ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
206 పరుగుల భారీ టార్గెట్ ను సన్ రైజర్స్ 4 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో రీచ్ అయింది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) అరాచకం సృష్టించాడు. క్లాసెన్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, ఓ సిక్సర్) కూడా రాణించాడు. 12 మ్యాచ్ ల్లో ఏడో ఓటమితో లక్నో ప్లేఆఫ్స్ కు దూరమైంది.
ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తో భారీ రన్ ఛేజింగ్ లో అభిషేక్ శర్మ రఫ్ఫాడించాడు. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ మరోసారి చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదారు. అథర్వను ఔట్ చేసి ఐపీఎల్ అరంగేట్రంలో తన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ సాధించాడు ఒరోర్క్. వికెట్ పడ్డా అభిషేక్ దంచుడు ఆగలేదు.
స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో అభిషేక్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో లాస్ట్ 4 బంతుల్లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు. వరుసగా 6, 6, 6, 6 రాబట్టి 18 బాల్స్ లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా బాదుడు కొనసాగించాడు.
20 బంతుల్లోనే 59 పరుగులు చేసిన అభిషేక్ జోరు చూస్తే సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రతి.. అభిషేక్ ను ఔట్ చేశాడు. వికెట్ తీసిన వెంటనే మరోసారి నోట్ బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనికి అభిషేక్ హర్ట్ అవడంతో ఆటగాళ్ల ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చివరకు అంపైర్లు జోక్యం చేసుకుని అభిషేక్ ను పెవిలియన్ పంపించారు.
ఇషాన్ కిషన్ (35)ను కూడా దిగ్వేష్ ఔట్ చేశాడు. మరో ఎండ్ నుంచి శార్దూల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో సన్ రైజర్స్ సమీకరణం 42 బంతుల్లో 58 పరుగులుగా మారింది. కానీ ఆ దశలో కమిందు మెండిస్ సన్ రైజర్స్ హీరోగా మారాడు. దిగ్వేష్ వేసిన 14వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఆ ఓవర్లో 17 రన్స్ రావడంతో 36 బంతుల్లో 41 పరుగులుగా ఈక్వేషన్ ఈజీగా మారింది.
మరోవైపు క్లాసెన్ కూడా అదరగొట్టాడు. శార్దూల్ వేసిన 18వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ ఆ వెంటనే క్లాసెన్ ఔటవడం, కండరాలు పట్టేయడంతో కమిందు రిటైర్డ్ ఔట్ వెళ్లిపోవడంతో ఉత్కంఠ రేగింది. కానీ అప్పటికీ 13 బంతుల్లో 9 పరుగులే అవసరమవగా.. అనికేత్, నితీశ్ కుమార్ చెరో ఫోర్ కొట్టి జట్టును గెలిపించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో అదరగొట్టింది. భారీ స్కోరు సాధించింది. ఆ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు సాధించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), మార్ క్రమ్ (38 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నికోలస్ పూరన్ (26 బంతుల్లో 45; 6 ఫోర్లు, ఓ సిక్సర్) మెరిశారు.
సంబంధిత కథనం