LSG vs KKR: నరైన్ ధనాధన్.. లక్నోపై కోల్‍కతా భారీ విజయం.. రమణ్‍దీప్ అద్భుత క్యాచ్-lsg vs kkr ipl 2024 highlights sunil narine blasting batting and ramandeep singh stunning catch kolkata beats lucknow ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Lsg Vs Kkr: నరైన్ ధనాధన్.. లక్నోపై కోల్‍కతా భారీ విజయం.. రమణ్‍దీప్ అద్భుత క్యాచ్

LSG vs KKR: నరైన్ ధనాధన్.. లక్నోపై కోల్‍కతా భారీ విజయం.. రమణ్‍దీప్ అద్భుత క్యాచ్

Chatakonda Krishna Prakash HT Telugu
May 05, 2024 11:39 PM IST

LSG vs KKR IPL 2024: లక్నోపై కోల్‍కతా నైట్‍రైడర్స్ భారీ విజయం సాధించింది. కేకేఆర్ ఆల్‍రౌండర్ సునీల్ నరైన్ మరోసారి సూపర్ హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. బౌలింగ్‍లోనూ కోల్‍కతా అదరగొట్టింది. దీంతో లక్నోపై ఘనంగా గెలిచింది.

LSG vs KKR: నరైన్ ధనాధన్.. లక్నోపై కోల్‍కతా భారీ విజయం.. రమణ్‍దీప్ అద్భుత క్యాచ్
LSG vs KKR: నరైన్ ధనాధన్.. లక్నోపై కోల్‍కతా భారీ విజయం.. రమణ్‍దీప్ అద్భుత క్యాచ్ (ANI )

LSG vs KKR IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR) మరోసారి అద్భుత ఆట తీరుతో దుమ్మురేపింది. అన్ని విభాగాల్లో సత్తాచాటి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టును కేకేఆర్ చిత్తుగా ఓడించింది. లక్నో వేదికగా నేడు (మే 5) జరిగిన మ్యాచ్‍లో కోల్‍కతా 98 పరుగుల భారీ తేడాతో హోం టీమ్‍ ఎల్‍ఎస్‍జీపై విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍కు దూసుకెళ్లింది కేకేఆర్. ప్లేఆఫ్స్‌కు దాదాపు అర్హత సాధించేసింది శ్రేయస్ అయ్యర్ సేన.

నరేన్ విధ్వంసం

కోల్‍కతా నైట్‍రైడర్స్ ఆల్‍రౌండర్, వెస్టిండీస్ స్టార్ సునీల్ నరైన్ ఈ సీజన్‍లో మరోసారి బ్యాట్‍తో విధ్వంసం చేశాడు. ఈ మ్యాచ్‍లో 39 బంతుల్లో 81 పరుగులతో మెరుపులు మెరిపించాడు. 6 ఫోర్లు, ఏకంగా 7 సిక్స్‌లు బాదేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు నరైన్ చుక్కలు చూపాడు. మొత్తంగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‍కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలో నరేన్‍కు తోడు ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 32 పరుగులు) హిట్టింగ్‍తో చెలరేగాడు. దీంతో నాలుగో ఓవర్లోనే 50 పరుగులను కేకేఆర్ దాటేసింది.

సాల్ట్ ఔటైనా నరైన్ జోరు కొనసాగించాడు. ఫోర్లు, భారీ సిక్స్‌లతో రెచ్చిపోయాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించారు. అయితే, 12వ ఓవర్లో లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయ్ అతడిని ఔట్ చేశాడు. యంగ్ బ్యాటర్ అంగ్‍క్రిష్ రఘువంశీ (32) మెప్పించాడు. ఆండ్రీ రసెల్ (12) త్వరగానే ఔట్ కాగా.. రింకూ సింగ్ (16), శ్రేయస్ అయ్యర్ (23) కాసేపు మెరిపించారు. చివర్లో రణ్‍దీప్ సింగ్ (6 బంతుల్లో 25 పరుగులు నాటౌట్) దుమ్మురేపాడు. దీంతో కోల్‍కతాకు భారీ స్కోరు దక్కింది.

లక్నో బౌలర్లలో నవీనుల్ హక్ మూడు వికెట్లు తీసినా.. 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించేశాడు. యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్‍వీర్ సింగ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

చేతులెత్తేసిన లక్నో

236 పరుగుల భారీ లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ చేతులెత్తేసింది. ఆరంభం నుంచే క్రమంగా వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడింది. కోల్‍కతా బౌలర్లు అదరగొట్టారు. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు లక్నో. 16.1 ఓవర్లలో కేవలం 137 పరుగులకే ఎల్‍ఎస్‍జీ ఆలౌటైంది. కోల్‍కతా ప్లేయర్ రమణ్‍దీప్ సింగ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‍తో లక్నో యంగ్ ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (9) ఔటయ్యాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (25) కాసేపు నిలిచాడు. మార్కస్ స్టొయినిస్ (36) కాసేపు పోరాడాడు. దీపక్ హుడా (5), నికోలస్ పూరన్ (10), ఆయుష్ బదోనీ (15), అస్టన్ టర్నర్ (16), కృణాల్ పాండ్యా (5) సహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ కనీస పోరాటం చేయలేకపోయారు. దీంతో లక్నో భారీ ఓటమిని మూటగట్టుకుంది.

కోల్‍కతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చెరో మూడు వికెట్లతో దుమ్మురేపారు. ఆండ్రీ రసెల్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

రమణ్‍దీప్ సూపర్ క్యాచ్

ఈ మ్యాచ్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ ప్లేయర్ రమణ్‍దీప్ సింగ్ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. రెండో ఓవర్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‍లో లక్నో ఓపెనర్ ఆర్షిన్ కులకర్ణి భారీ షాట్‍కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తాకి గాల్లోకి చాలా పైకి లేచింది. దీంతో కోల్‍కతా ఫీల్డర్ రమణ్‍దీప్ సింగ్ చాలా దూరం పరుగెత్తి ఫుల్ డైవ్ కొట్టి క్యాచ్ పట్టాడు. డీప్ కవర్ వరకు వెనక్కి చూస్తే వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన డైవ్‍తో బంతిని ఒడిసిపట్టాడు. ఇది ఐపీఎల్‍లో బెస్ట్ క్యాచా? అని అప్పుడు కామెంటరీ చేస్తున్న రవిశాస్త్రి అన్నారు. రమణ్‍దీప్ క్యాచ్‍కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాప్‍కు కోల్‍కతా

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‍ల్లో 8 గెలిచింది కోల్‍కతా నైట్ రైడర్స్.16 పాయింట్లను దక్కించుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‍కు కోల్‍కతా టాప్ ప్లేస్‍కు దూసుకెళ్లింది. 11 మ్యాచ్‍ల్లో 6 గెలిచి.. ఐదు ఓడిన లక్నో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది.

Whats_app_banner