LSG vs CSK Live: జడేజా హాఫ్ సెంచరీ.. చివర్లో మొయిన్ అలీ, ధోనీ మెరుపులు.. సీఎస్కే మోస్తరు స్కోరు
LSG vs CSK Live: లక్నో సూపర్ కింగ్స్ పై ఓ మోస్తరు స్కోరు సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ, మొయిన్ అలీ మెరుపులతో సీఎస్కే మంచి స్కోరు చేసింది.
LSG vs CSK Live: లక్నో సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 రన్స్ చేసింది. జడేజా హాఫ్ సెంచరీకి తోడు చివర్లో మరోసారి ధోనీ మెరుపులు సీఎస్కేకు మంచి స్కోరు అందించింది. ఈ మ్యాచ్ లో మొదటి నుంచి సీఎస్కే బ్యాటర్లు తడబడుతూ బ్యాటింగ్ చేయడంతో 150 స్కోరైనా సాధ్యమా అనిపించింది. కానీ మరోసారి ధోనీ మరోసారి కేవలం 9 బంతుల్లో 28 రన్స్ చేసి తన జట్టుకు మంచి స్కోరు అందించాడు.

ధోనీ మెరుపులు
ఈ సీజన్ ఐపీఎల్లో చివర్లో వచ్చి మెరుపులు మెరిపిస్తున్న ఎమ్మెస్ ధోనీ.. లక్నోలోనూ అదే రిపీట్ చేశాడు. ఐదు లేదా ఆరు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వస్తున్న ధోనీ.. చివర్లో రెండు, మూడు ఓవర్లలోనే చెలరేగుతున్నాడు. ఈ మ్యాచ్ లోనూ ధోనీ కేవలం 9 బంతుల్లో 28 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. ఈ సీజన్లో ఒక్కసారి కూడా ఔట్ కాని రికార్డును అతడు కొనసాగించాడు.
మరోవైపు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. అతడు మొదటి నుంచీ బాధ్యతాయుతంగా ఆడుతూ 40 బంతుల్లో 57 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చివర్లో జడేజాతో కలిసి ఏడో వికెట్ కు అజేయంగా 16 బంతుల్లోనే 35 పరుగులు జోడించాడు ధోనీ. దీంతో సీఎస్కే ఫైటింగ్ స్కోరు చేయగలిగింది.
అంతకుముందు మొయిన్ అలీ, అజింక్య రహానే కూడా రాణించారు. మొయిన్ అలీ 20 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. బిష్ణోయ్ ఓవర్లో వరుసగా మూడు సిక్స్ లు బాది సీఎస్కే స్కోరును పరుగులు పెట్టించాడు. ఇక ఓపెనర్ గా వచ్చిన రహానే 24 బంతుల్లో 36 రన్స్ చేశాడు. మొయిన్ అలీ, ధోనీ మెరుపులతో సీఎస్కే చివరి 4 ఓవర్లలోనే 62 రన్స్ చేయడం విశేషం.
నిజానికి ఈ మ్యాచ్ లో మొదట సీఎస్కే బ్యాటర్లు తడబడ్డారు. రచిన్ రవీంద్ర తొలి బంతికే డకౌటయ్యాడు. తర్వాత రుతురాజ్ (17) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. శివమ్ దూబె (3), సమీర్ రిజ్వి (1)కూడా ఫెయిలయ్యారు. దీంతో చెన్నై 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో 150 స్కోరు కూడా కష్టంగానే అనిపించినా.. ధోనీ, మొయిన్ అలీ ఏకంగా 176 వరకూ తీసుకెళ్లారు.