Legends Cricket Trophy 2024: క్రికెట్‌లో కొత్త లీగ్.. 90 బాల్స్ మ్యాచ్.. యువరాజ్, రైనా, గేల్ ఆడుతున్న ఈ లీగ్ ఏంటి?
Legends Cricket Trophy 2024: క్రికెట్‌లో ఇప్పటికే ఉన్న టీ20, టీ10 ఫార్మాట్లకు తోడుగా 90 బాల్ ఫార్మాట్ రాబోతోంది. యువరాజ్, రైనా, గేల్ లాంటి మాజీలు ఆడనున్న ఈ లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024 గురించి మరిన్ని విశేషాలు చూడండి.
Legends Cricket Trophy 2024: క్రికెట్ అభిమానులను అలరించడానికి సరికొత్త టోర్నీ రాబోతోంది. దీనిపేరు లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ. ఇది టీ20, టీ10 ఫార్మాట్లకు భిన్నంగా ఒక ఇన్నింగ్స్ 90 బంతుల పాటు సాగే మ్యాచ్. ఈ లీగ్ మార్చి 8 నుంచి 19 వరకూ శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో జరగబోతోంది. అసలు ఈ లీగ్ ఏంటి? ఇందులో పాల్గొనబోయే స్టార్ ప్లేయర్స్ ఎవరు? ఎక్కడ చూడాలి అన్న వివరాలు ఇక్కడ చూడండి.

లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024
క్రికెట్ లో రోజుకో కొత్త లీగ్ పుట్టుకొస్తున్న కాలమిది. చివరికి రిటైరైన ప్లేయర్స్ తోనూ ఇప్పటికే కొన్ని లీగ్స్ జరుగుతుండగా.. తాజాగా శ్రీలంకలో లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ పేరుతో సరికొత్త టోర్నీ మార్చి 8 నుంచి ప్రారంభం కానుంది. క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలోనే ఈ టోర్నీ మొత్తం జరుగుతుంది. ఇందులో క్రిస్ గేల్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి మాజీ క్రికెటర్లు పాల్గొననున్నారు.
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ.. సరికొత్త రూల్స్
ఫార్మాట్ కు తగినట్లే క్రికెట్ లో నిబంధనలు మారిపోతాయి. ఇప్పుడీ టోర్నీ ఒక్కో ఇన్నింగ్స్ 90 బంతులు అంటే 15 ఓవర్ల పాటు సాగనుంది. దీంతో దీనికి తగిన నిబంధనలను రూపొందించారు. మొత్తం ఐదుగురు బౌలర్లు మూడేసి ఓవర్లు వేసే అవకాశం ఇందులో ఉంటుంది. అయితే ఇందులో వ్యూహాత్మక ట్విస్ట్ కూడా ఉంది. 60వ బంతిలోపు ఒక బౌలర్ మాత్రం తన నాలుగు ఓవర్లు వేయాలి.
ఇక దీనికి కూడా పవర్ ప్లేలు రెండు ఉన్నాయి. బౌలింగ్ పవర్ ప్లే ఒకటి నుంచి 24వ బంతి వరకూ ఉంటుంది. బ్యాటింగ్ పవర్ ప్లేను 60వ బంతి తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇక స్ట్రేటజిక్ టైమౌట్లు కూడా ఉంటాయి. 48వ బంతి తర్వాత టైమౌట్ ఉంటుంది. ఒకవేళ వికెట్ పడితే 42 నుంచి 48వ బంతి వరకు ఎప్పుడైనా ఈ టైమౌట్ తీసుకునే వీలుంటుంది.
లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ టీమ్స్
ఈ టోర్నీలో మొత్తం ఏడు జట్లు పార్టిసిపేట్ చేయనున్నాయి. ప్రతి టీమ్ లో ఇప్పటికే క్రికెట్ నుంచి రిటైరైన ప్లేయర్స్ ఉంటారు. వీటిలో క్యాండీ సాంప్ ఆర్మీ జట్టుకు ఆరోన్ ఫించ్, రాజస్థాన్ కింగ్స్ జట్టుకు రాబిన్ ఉతప్ప, కొలంబో లయన్స్ కు క్రిస్ గేల్, ఢిల్లీ డెవిల్స్ కు సురేశ్ రైనా, దుబాయ్ జెయింట్స్ కు హర్భజన్ సింగ్, న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ కు యువరాజ్ సింగ్, పంజాబ్ రాయల్ కు దిల్షాన్ కెప్టెన్లుగా ఉన్నారు.
ఈ కొత్త 90 బంతుల టోర్నీ అభిమానులను బాగా ఆకర్షిస్తుందన్న నమ్మకంతో నిర్వాహకులు ఉన్నారు. కెప్టెన్లే కాకుండా ఆయా జట్లలో రాస్ టేలర్, షాహిద్ అఫ్రిది, షాన్ మార్ష్, మార్టిన్ గప్టిల్, లెండిల్ సిమన్స్ లాంటి టాప్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ 2024ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లేదా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు.