Kuldeep yadav: నేనున్నాను.. ఇండియాకు ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదు: కుల్దీప్ యాదవ్
Kuldeep yadav: నేనున్నాను.. ఇండియాకు ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదు అని అన్నాడు టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఆసియా కప్ లో చెలరేగుతున్న కుల్దీప్.. ఇండియా సూపర్ 4లో రెండు మ్యాచ్ లు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
Kuldeep yadav: ఇండియన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో టాప్ లో ఉన్నాడు. సూపర్ 4లో పాకిస్థాన్ పై 5 వికెట్లు, శ్రీలంకపై 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన అతడు.. ఇండియాకు ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదని చెప్పడం విశేషం. అంతేకాదు తన బౌలింగ్ స్టైల్ మార్చడం వల్లే మరింత మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నట్లు తెలిపాడు.
గాయం నుంచి కోలుకొని వచ్చిన తర్వాత కుల్దీప్ యాదవ్ చెలరేగుతున్న విషయం తెలిసిందే. "నేను గాయపడినప్పుడు ఏది ఏమైనా నా మోకాలిపై భారం పడొద్దని ఫిజియో చెప్పాడు. కానీ అది ఎలా చేయాలో నాకు తెలియదు. రెండు, మూడు నెలల తర్వాత మెల్లగా కోలుకుంటూ నా రనప్ వేగంగా మొదలుపెట్టాను. యాంగిల్ మార్చలేదు. తర్వాత మెల్లగా నేరుగా బౌలింగ్ చేయడం ప్రారంభించాను. అది సులువుగా అనిపించింది. మరింత దూకుడుగా మారాను. నా రిథమ్ మెరుగైంది. అది సహజంగా రాలేదు. ఐదారు నెలలు పట్టింది" అని కుల్దీప్ చెప్పాడు.
"ఆరేడు నెలల తర్వాత మంచి రిథమ్ వచ్చింది. ఇప్పుడు చాలా ఈజీగా బౌలింగ్ చేస్తున్నాను. నేనిప్పుడు వికెట్ కోసం ఎక్కువగా ఆలోచించడం లేదు. నా లెంత్ పైనే దృష్టి సారిస్తున్నాను. మంచి లెంత్ లో బాల్స్ వేయడానికి ప్రయత్నిస్తున్నాను. లెంత్ తోపాటు లైన్ కూడా ముఖ్యమే. స్టంప్స్ లైన్ లో బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. బ్యాటర్ ను లాక్ చేయడం నా ఉద్దేశం. అసలు షాట్ ఆడటానికి రూమ్ ఇవ్వకూడదని భావిస్తున్నాను" అని కుల్దీప్ తెలిపాడు.
ఇక ఇండియన్ టీమ్ కు ఆఫ్ స్పిన్నర్ అవసరంపై కూడా కుల్దీప్ స్పందించాడు. "నన్ను నేను ఆఫ్ స్పిన్నర్ గా భావించను. నేనో క్లాసిక్ లెగ్ స్పిన్నర్. కాకపోతే నేను లెఫ్ట్ హ్యాండ్ తో వేస్తాను అంతే తేడా. నాకు వేరియేషన్స్ ఉన్నాయి. గూగ్లీ కూడా వేస్తాను. అందువల్ల ఆఫ్ స్పిన్నర్ అవసరం లేదు. టీమ్ కాంబినేషన్ బాగుంటే ముగ్గురు, నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు ఉంటే చాలు" అని కుల్దీప్ అనడం విశేషం.