Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోనే బెస్ట్ స్పిన్నర్: ఆకాశ్ చోప్రా-kuldeep yadav is worlds best spinner at the moment says aakash chopra ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోనే బెస్ట్ స్పిన్నర్: ఆకాశ్ చోప్రా

Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోనే బెస్ట్ స్పిన్నర్: ఆకాశ్ చోప్రా

Hari Prasad S HT Telugu
Sep 14, 2023 02:42 PM IST

Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ ప్రపంచంలోనే బెస్ట్ స్పిన్నర్ అని అన్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో రెండు మ్యాచ్ లలోనే 9 వికెట్లతో కుల్దీప్ టాప్ లో ఉన్న విషయం తెలిసిందే.

కుల్దీప్ యాదవ్
కుల్దీప్ యాదవ్ (AFP)

Kuldeep Yadav: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసియా కప్ లో చెలరేగుతున్న సంగతి తెలుసు కదా. సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంకలతో మ్యాచ్ లలో ఒంటిచేత్తో గెలిపించాడు. పాకిస్థాన్ పై 5, శ్రీలంకపై 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ స్పిన్నర్ కుల్దీప్ అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అనడం విశేషం.

తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. కుల్దీప్ యాదవ్ ను ఆకాశానికెత్తాడు. "ప్రస్తుతం కుల్దీప్ ప్రపంచంలోనే బెస్ట్ స్పిన్నర్. కుల్దీప్ యాదవ్ గణాంకాలు చూస్తే అతడు అసలైన వికెట్ టేకర్ అని చెప్పొచ్చు. వన్డేల్లో 150 వికెట్లు తీసుకున్న స్పిన్నర్ల గురించి మాట్లాడుతున్నాం. మొదటగా చెప్పాలంటే 150 వికెట్లు చాలా పెద్ద నంబరే. అదేమీ చిన్నది కాదు" అని ఆకాశ్ చోప్రా అన్నాడు.

కుల్దీప్ మిస్టరీ స్పిన్నర్ ఏమీ కాదని, సాంప్రదాయ స్పిన్నర్ కావడమే అతని ప్రత్యేకత అని కూడా చెప్పాడు. "150 వికెట్లు తీసుకోవడానికి కుల్దీప్ కు కేవలం 85 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. అతని స్ట్రైక్ రేట్ 30.1. అతడు సాంప్రదాయ స్పిన్నర్ కావడమే ప్రత్యేకత. అజంత మెండిస్, రషీద్ ఖాన్ లాంటి వాళ్ల గురించి మాట్లాడితే వాళ్లు మిస్టరీ స్పిన్నర్లు. ఇతని దగ్గర ఏ మిస్టరీ లేదు. సాధారణ లెగ్ స్పిన్, గూగ్లీ వేసి ఇరికిస్తాడు" అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

పాకిస్థాన్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై కుల్దీప్ 5 వికెట్లు తీయడం విశేషం. అతని స్నిన్ మాయాజాలంతో పాక్ కేవలం 128 పరుగులకే కుప్పకూలింది. ఇక శ్రీలంకతోనూ కష్టాల్లో ఉన్నట్లు అనిపించిన టీమ్ ను కుల్దీప్ ఆదుకున్నాడు. 9.3 ఓవర్లలో 43 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీయడంతో శ్రీలంక 214 పరుగుల టార్గెట్ కూడా చేజ్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్ లోనే కుల్దీప్ వన్డేల్లో 150 వికెట్ల మైలురాయి అందుకున్నాడు.

Whats_app_banner