Venkatesh Iyer: టీమిండియా క్రికెటర్, ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్.. వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ 2024 టైటిల్ చేతబట్టిన వారంలోనే పెళ్లి పీటలు ఎక్కాడు. శృతి రఘునాథన్‍ను నేడు (జూన్ 2) వివాహం చేసుకున్నాడు వెంకటేశ్ అయ్యర్. బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.
వెంకటేశ్ అయ్యర్ - శృతి రఘునాథన్ నిశ్చితార్థం 2023 నవంబర్‌లో జరిగింది. ఇప్పుడు వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్న వెంకటేశ్ అయ్యర్‌కు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు క్రికెటర్లు కూడా అతడికి విషెస్ తెలియజేస్తున్నారు.
వధూవరులు ఇద్దరూ సంప్రదాయ దుస్తులు ధరించారు. పంచెకట్టు, కండువాతో వెంకటేశ్ అయ్యర్ ఉండగా.. పసుపు రంగు చీర, బంగారు ఆభరాణాలు ధరించారు శృతి. వీరి పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ స్టార్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ అదరగొట్టాడు. ధనాధన్ బ్యాటింగ్‍తో దుమ్మురేపాడు. 14 మ్యాచ్‍ల్లో 158 స్ట్రైక్‍రేట్‍తో 370 పరుగులతో రాణించాడు అయ్యర్. నాలుగు అర్ధ శతకాలు చేశారు. కేకేఆర్ టైటిల్ గెలువడంలో కీలకపాత్ర పోషించాడు.
సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్‍లో వెంకటేశ్ అయ్యర్ మెరుపులతో కోల్‍కతా అలవోకగా గెలిచింది. ఈ తుదిపోరులో అయ్యర్ 26 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులతో మెరుపు అర్ధ శతకం చేశాడు. దీంతో కోల్‍కతా కేవలం 10.3 ఓవర్లలోనే 114 పరుగులు చేసి విజయం సాధించింది. పదేళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ పట్టింది. కేకేఆర్‌కు ఇది మూడో టైటిల్‍గా ఉంది.
గతం వారం (మే 26) ఐపీఎల్ 2024 టైటిల్ చేతబట్టిన వెంకటేశ్.. సరిగ్గా వారానికే వివాహం చేసుకున్నాడు.
వెంకటేశ్ అయ్యర్ - శృతి వివాహానికి కేకేఆర్ కో-ఓనర్ వెంకీ మైసూర్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంప్రదాయబద్ధంగా అద్భుతంగా పెళ్లి జరిగిందని ట్వీట్ చేశారు వెంకీ మైసూర్.
టీమిండియా తరపున వెంకటేశ్ అయ్యర్ 9 టీ20లు, 2 వన్డేలు ఆడాడు. అయితే, ఫామ్ కోల్పోవడంతో అతడికి భారత జట్టులో మళ్లీ చోటు పోయింది. అయితే, మళ్లీ టీమిండియాలో ప్లేస్ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్‍లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‍కతా నైట్‍రైడర్స్ టైటిల్ కైవసం చేసుకుంది. గత రెండు సీజన్లలో ఏడో స్థానంలో నిలిచి నిరాశ పరిచిన ఆ జట్టు.. ఈసారి ఛాంపియన్‍గా నిలిచింది. గతంలో కెప్టెన్‍గా ఆ జట్టుకు రెండు టైటిళ్లు అందించిన గౌతమ్ గంభీర్.. మెంటార్‌గా రావడం కలిసి వచ్చింది. గంభీర్ దిశానిర్దేశంలో ఈ ఏడాది కోల్‍కతా దుమ్మురేపింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్‍లో నిలిచింది. ప్లేఆఫ్స్‌లో క్వాలిఫయర్-1లోనే గెలిచి ఫైనల్ చేరింది. ఫైనల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై అలవోకగా గెలిచి కోల్‍కతా టైటిల్ కైవసం చేసుకుంది. 2012, 2014 తర్వాత ఇప్పుడు మూడోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది కేకేఆర్.