కేకేఆర్ ఘోరమైన ప్రదర్శన.. డిఫెండింగ్ ఛాంపియన్ కు ఏమైంది? ఫ్లాప్ షోకు 5 కారణాలు..ఓ లుక్కేయండి-kolkata knight riders knocked out of ipl 2025 play offs 5 reasons for kkr failure ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  కేకేఆర్ ఘోరమైన ప్రదర్శన.. డిఫెండింగ్ ఛాంపియన్ కు ఏమైంది? ఫ్లాప్ షోకు 5 కారణాలు..ఓ లుక్కేయండి

కేకేఆర్ ఘోరమైన ప్రదర్శన.. డిఫెండింగ్ ఛాంపియన్ కు ఏమైంది? ఫ్లాప్ షోకు 5 కారణాలు..ఓ లుక్కేయండి

ఐపీఎల్ 2024లో కేకేఆర్ ఛాంపియన్. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ఆ టీమ్ 2025లో ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. మరి ఆ టీమ్ కు ఏమైంది? ఆ జట్టు ఫ్లాప్ షోకు 5 కారణాలు చూసేయండి.

ప్రాక్టీస్ లో కేకేఆర్ ప్లేయర్లు

డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ కు షాక్. ఐపీఎల్ 2025లో ఆ టీమ్ కు దారుణ పరాభవం. కనీసం ప్లేఆఫ్స్ చేరకుండానే ఆ టీమ్ నిష్క్రమించింది. ప్లేఆఫ్స్ రేసుకు దూరమైన ఘోరమైన అవమానం మూటగట్టుకుంది. శనివారం (మే 17) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దవడంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ కు దూరమైంది. ఆ టీమ్ ఫ్లాప్ షోకు రీజన్స్ ఏమిటో చూసేయండి.

బ్యాటింగ్ ఫెయిల్యూర్

ఐపీఎల్ 2025లో కేకేఆర్ బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైంది. క్రీజులో నిలబడి మ్యాచ్ ను గెలిపించే బ్యాటరే కనిపించలేదు. కెప్టెన్ అజింక్య రహానె మినహా ఆ టీమ్ లో నిలకడగా ఆడిన బ్యాటరే లేడు. 11 మ్యాచ్ ల్లో 348 పరుగులు చేసిన రహానె కూడా టీమ్ ను గెలిపించే ఇన్నింగ్స్ లు ఆడలేకపోయాడు. ఆ టీమ్ లో దూకుడన్నదే లేదు.

ఆ దంచుడు ఏదీ?

కేకేఆర్ బ్యాటింగ్ అంటే ఓపెనర్ గా నరైన్ వచ్చి రెచ్చిపోయేవాడు. కానీ ఈ సీజన్ లో బ్యాటర్ గా నరైన్ ఫెయిల్ అయ్యాడు. 11 మ్యాచ్ ల్లో 215 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో టీమ్ కు మెరుపు ఆరంభాలు దక్కలేదు. సిక్సర్ల వీరుడు రింకు సింగ్ (197), విధ్వంకర బ్యాటర్ రసెల్ (167) తేలిపోయారు. రూ.23.75 కోట్ల ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ (142) గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

బౌలింగ్ ఓకే కానీ

కేకేఆర్ బౌలింగ్ పరంగా చూస్తే బెటర్ గానే ఉంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 12 మ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. కేకేఆర్ టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. పేసర్లు వైభవ్ అరోరా (16), హర్షిత్ రాణా (15) కూడా ఫర్వాలేదనిపించారు. కానీ టీమ్ కు అవసరమైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టలేకపోయారు. ఇక నరైన్ (10) బౌలింగ్ లోనూ ఫెయిలయ్యాడు. ఈ ప్రభావం టీమ్ పై పడింది.

శ్రేయస్ ను వదులుకుని

ఐపీఎల్ 2024 సీజన్ లో కేకేఆర్ ను విజేతగా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఆ ఫ్రాంఛైజీ వద్దనుకుంది. బ్యాటర్ గా, కెప్టెన్ గా శ్రేయస్ అదరగొట్టాడు. అయినా వదిలేసుకుంది. వేలంలో రహానేను తీసుకుని కెప్టెన్ గా సెలెక్ట్ చేసింది. కానీ శ్రేయస్ లా రహానె ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్.. ఆ టీమ్ ను ప్లేఆఫ్స్ దిశగా నడిపిస్తున్నాడు.

తక్కువ తేడాతో

ఐపీఎల్ 2025లో కేేకేఆర్ కొన్ని మ్యాచ్ లను స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఒత్తిడిని దాటలేకపోయింది. ఈ మ్యాచ్ లు గెలిస్తే కేకేఆర్ పరిస్థితి బెటర్ గా ఉండేది. లక్నో చేతిలో 4 పరుగుల తేడాతో కేకేఆర్ ఓడిపోయింది. పంజాబ్ సెట్ చేసిన 112 రన్స్ టార్గెట్ ను అందుకోలేకపోయింది. 95 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే చేతిలో రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

వరుణుడు కూడా కేకేఆర్ అవకాశాలను దెబ్బతీశాడు. వర్షం కారణంగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ను కేకేఆర్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇక డూ ఆర్ డై మ్యాచ్ లో ఆర్సీబీతో కూడా వర్షం కారణంగా పాయింట్ పంచుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లు జరిగి, ఇందులో కేకేఆర్ గెలచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం