ఐపీఎల్ 2025లో బుధవారం (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. 3 వికెట్లతో సత్తాచాటాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై గుజరాత్ ను గెలిపించాడు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లికి ఫస్ట్ బాల్ వేసే ముందు సిరాజ్ ఎమోషనల్ అయినట్లు కనిపించాడు. బంతి వేసేందుకు పరుగెత్తుకుంటూ వచ్చిన సిరాజ్ సడెన్ గా ఆగిపోయి మళ్లీ వెనక్కి వెళ్లాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో 2018 నుంచి 2024 ఆర్సీబీ తరపున ఆ టీమ్ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో సిరాజ్ ఆడిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఐపీఎల్ సీజన్ ముందు సిరాజ్ ను ఆర్సీబీ వదిలేసుకుంది. అతణ్ని వేలంలో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఏ స్టేడియంలో అయితే గతంలో ఆర్సీబీని సిరాజ్ గెలిపించాడో.. ఇప్పుడు అదే స్టేడియంలో ఆ టీమ్ ఓటమికి కారణమయ్యాడు.
ముఖ్యంగా కోహ్లీతో ఉన్న స్పెషల్ బాండింగ్ కారణంగా కోహ్లీకి బౌలింగ్ చేసేటప్పుడు సిరాజ్ తడబడ్డాడు. ఫుల్ జోష్ తో పరిగెత్తినా మధ్యలోనే వెనక్కి తగ్గాడు. ఒక ఫాస్ట్ బౌలర్ రన్ అప్ మిస్ కావడం సాధరణమే. అయితే బెంగళూరులో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీకి తొలి బంతిని సిరాజ్ వేయలేకపోయాడని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.
‘‘నేను ఇక్కడ (ఆర్సీబీ తరఫున) ఏడేళ్లు ఆడాను కాబట్టి భావోద్వేగానికి గురయ్యా. కొంత కంగారు, కొంత భావోద్వేగం ఉన్నప్పటికీ బంతి చేతికి అందిన మరుక్షణమే బౌలింగ్ ఫుల్ ఆన్ అయింది' అని సిరాజ్ తెలిపాడు.
ఐపీఎల్ లో తనను రిటైన్ చేసుకోని ఆర్సీబీపై చెలరేగిన సిరాజ్ రివేంజ్ తీర్చుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పేసర్ ను ఆర్సీబీ వదిలేయడంపైనా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సీజన్ లో మూడు మ్యాచ్ లాడిన ఆర్సీబీ 5 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆర్సీబీపై 3 వికెట్లతో సంచలన ప్రదర్శన చేశాడు. ఆర్సీబీపై గుజరాత్ టైటాన్స్ ను గెలిపించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా సెలక్షన్ కమిటీ సిరాజ్ ను ఎంపిక చేయని సంగతి తెలిసిందే. అతని పేలవ ఫామే అందుకు కారణం. అంతకంటే ముందు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ లో సిరాజ్ ఫెయిల్ అయ్యాడు. దీంతో సిరాజ్ పై సెలక్టర్లు వేటు వేశారు. ఆర్సీబీ కూడా వదిలేసింది. కానీ ఈ ఐపీఎల్ లో బంతితో అదరగొట్టి తిరిగి టీమిండియాలోకి రావాలనే కసితో ఈ హైదరాబాదీ మియా భాయ్ కనిపిస్తున్నాడు.
సంబంధిత కథనం