india vs england 3rd odi: కోహ్లీపై ఫోకస్.. శుభ్ మన్, శ్రేయస్ ఔట్.. మూడో వన్డేకు టీమ్ఇండియాలో మార్పులు!
india vs england 3rd odi: ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ సొంతం చేసుకున్న భారత్ బుధవారం (ఫిబ్రవరి 12) జరిగే మూడో వన్డేలో ప్రయోగాలు చేయబోతోంది. ఫోకస్ మొత్తం కోహ్లీపైనే ఉండగా.. శుభ్ మన్, శ్రేయస్ కు రెస్ట్ నిచ్చి పంత్, జైస్వాల్ ను ఆడించే ఛాన్స్ ఉంది.

ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లోనూ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు క్లీన్ స్వీప్ లక్ష్యంగా బుధవారం (ఫిబ్రవరి 12) అహ్మదాబాద్ లో చివరి వన్డే ఆడబోతోంది. ఈ మ్యాచ్ కు శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. పంత్, జైస్వాల్, సుందర్ ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.
కోహ్లీపైనే ఫోకస్
ఇంగ్లండ్ తో రెండో వన్డేలో సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందుకున్నాడు. ఇక ఫోకస్ మొత్తం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపైకి షిఫ్ట్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే ఇదే కాబట్టి ఈ మ్యాచ్ లో కోహ్లి ఫామ్ అందుకోవాలని మేనేజ్ మెంట్ ఆశిస్తోంది. మోకాలి వాపుతో ఇంగ్లండ్ తో తొలి వన్డేకు దూరమైన కోహ్లి.. రెండో వన్డేలో 5 పరుగులే చేశాడు. ఈ మూడో వన్డేలో కోహ్లి రాణించడం అత్యవసరం.
శ్రేయస్, శుభ్ మన్ ఔట్
తొలి రెండు వన్డేల్లో రాణించిన శ్రేయస్, శుభ్ మన్ కు ఈ మూడో వన్డేలో రెస్ట్ ఇచ్చే అవకాశముంది. గత రెండు మ్యాచ్ ల్లో శుభ్ మన్ 87, 60.. శ్రేయస్ 59, 44 పరుగులు చేశాడు. వీళ్ల స్థానంలో జైస్వాల్, పంత్ ను ఆడించే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ తో వన్డేల్లో అరంగేట్రం చేసిన జైస్వాల్ రాణించలేకపోయాడు. ఇక పంత్ కు అవకాశమే రాలేదు. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాటర్ గా పంత్ ఆడొచ్చు.
రాహుల్ నాలుగులో
తొలి రెండు వన్డేల్లో కేఎల్ రాహుల్ ను ఆరో స్థానంలో బ్యాటింగ్ కు పంపడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చివరి వన్డేలో శ్రేయస్ స్థానంలో రాహుల్ ను నాలుగోె స్థానంలో బ్యాటింగ్ కు దింపే అవకాశముంది. ఇక సీనియర్ స్పిన్నర్ జడేజా కు విశ్రాంతినిచ్చి వాషింగ్టన్ సుందర్ ను ఆడించే ఛాన్స్ ఉంది. అలాగే అక్షర్ బదులు కుల్ దీప్, షమి స్థానంలో అర్ష్ దీప్ ను ఆడించే అవకాశాలను కొట్టిపారేయలేం.
సంబంధిత కథనం