IND vs SL 3rd ODI: కేఎల్ రాహుల్‍‍పై వేటు తప్పాదా.. మరో మార్పు కూడా..! లంకతో మూడో వన్డేకు భారత తుది జట్టు ఇలా!-kl rahul and shivam dube may out from india final xi against sri lanka in 3rd odi ind vs sl cricket news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Sl 3rd Odi: కేఎల్ రాహుల్‍‍పై వేటు తప్పాదా.. మరో మార్పు కూడా..! లంకతో మూడో వన్డేకు భారత తుది జట్టు ఇలా!

IND vs SL 3rd ODI: కేఎల్ రాహుల్‍‍పై వేటు తప్పాదా.. మరో మార్పు కూడా..! లంకతో మూడో వన్డేకు భారత తుది జట్టు ఇలా!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 06, 2024 07:52 PM IST

IND vs SL 3rd ODI Predicted XI: శ్రీలంకతో నిర్ణయాత్మక మూడో వన్డేకు టీమిండియా రెడీ అయింది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‍ను భారత్ సమం చేసుకోగలదు. దీంతో తుదిజట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IND vs SL 3rd ODI: కేఎల్ రాహుల్‍‍పై వేటు తప్పాదా.. మార్పు కూడా.. లంకతో మూడో వన్డేకు భారత తుది జట్టు ఇలా!
IND vs SL 3rd ODI: కేఎల్ రాహుల్‍‍పై వేటు తప్పాదా.. మార్పు కూడా.. లంకతో మూడో వన్డేకు భారత తుది జట్టు ఇలా! (AP)

శ్రీలంకతో వన్డే సిరీస్‍లో కీలక పోరుకు భారత్ సిద్ధమవుతుంది. ఈ మూడు మ్యాచ్‍ల సిరీస్‍లో తొలి వన్డే అనూహ్యంగా టై కాగా.. రెండో దాంట్లో భారత్ కుప్పకూలి ఓడింది. మూడో వన్డేలో గెలిస్తేనే ఈ సిరీస్‍ను కనీసం చేసుకోగలుగుతుంది. ఈ కీలకమైన మూడో వన్డే కొలంబో వేదికగా బుధవారం (ఆగస్టు 7) జరగనుంది. లంక పర్యటనలో ఈ తుది మ్యాచ్ గెలిచి సిరీస్‍ను సమం చేయాలని రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ కసిగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‍కు తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాహుల్ ఔట్!

లంకతో మూడో వన్డేకు తుదిజట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‍ను టీమిండియా తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి వన్డేలో 31 పరుగులు చేసినా కీలక సమయంలో చివరి వరకు నిలువలేకపోయాడు రాహుల్. నెమ్మదిగానే ఆడాడు. రెండో మ్యాచ్‍లో డకౌటై నిరాశపరిచాడు. దీంతో మూడో వన్డేలో రాహుల్ స్థానంలో హిట్టర్ రిషబ్ పంత్‍ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. దూకుడుగా ఆడడం పంత్‍కు ప్లస్‍గా ఉంది. మరి రాహుల్‍పైనే టీమిండియా మేనేజ్‍మెంట్ నమ్మకం ఉంచుతుందా.. పంత్ వైపు మొగ్గు చూపుతుందా అనేది చూడాలి.

దూబే ప్లేస్‍లో పరాగ్ వస్తాడా!

భారత ఆల్‍రౌండర్ శివం దూబే.. తొలి వన్డేలో రాణించాడు. అయితే, రెండో మ్యాచ్‍లో ఇబ్బందులు పడ్డాడు. కీలక సమయంలో ఔటయ్యాడు. అయితే, కొలంబో పిచ్ స్పిన్‍కు ఎక్కువగా అనుకూలిస్తుండటంతో దూబే స్థానంలో పరాగ్‍ను తీసుకునే ఆలోచనను టీమిండియా మేనేజ్‍మెంట్ చేయవచ్చు. పరాగ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇదే అతడికి సానుకూల అంశంగా ఉంది. ఇప్పటికే కుల్దీప్, వాషింగ్టన్, అక్షర్ స్పిన్నర్లుగా ఉండగా.. పరాగ్ వస్తే మరో ఆప్షన్ రోహిత్‍కు అందుబాటులో ఉంటుంది.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రెండు వన్డేల్లో అర్ధ శతకాలతో మెరిపించాడు. దూకుడైన బ్యాటింగ్‍తో టీమిండియాకు అదిరే ఆరంభాలు ఇచ్చాడు. అయితే, ఆ తర్వాతి బ్యాటర్లు విఫలమయ్యారు. సులువైన లక్ష్యాల ముందు కూడా తడబడ్డారు. తొలి మ్యాచ్ టై అయినా.. రెండో వన్డేలో వరుసగా ఔటయ్యారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్లపై బాగా ఆడతాడని పేరున్న శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్‍లో విఫలమయ్యారు. మూడో వన్డేలో వీరు ఫామ్‍లోకి రావాల్సి ఉంది.

శ్రీలంకతో మూడో వన్డే భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే / రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్

ఈ మూడో వన్డే కోసం శ్రీలంక తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. విన్నింగ్ కాంబినేషన్‍ను కంటిన్యూ చేసేందుకు మొగ్గు చూపనుంది.

శ్రీలంక తుదిజట్టు (అంచనా): పాతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుషాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), జనిత్ లియనాగే, దునిత్ వెల్లాలగే, కమిందు మెండిస్, జెఫ్రీ వాండర్సే, అఖిల ధనుంజయ, అషిత ఫెర్నాండో

టైమ్, లైవ్

భారత్, శ్రీలంక మధ్య మూడో వన్డే బుధవారం (ఆగస్టు 7) మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలవుతుంది. సోనీ స్పోర్ట్స్ టీవీ ఛానెళ్లు, సోనీలివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు.