Rishabh Pant: టీ20 ప్రపంచకప్‍‍ మాస్టర్‌ప్లాన్‍ను ఐపీఎల్‍లో పంత్ ఫాలో అయ్యాడా? ఏం జరిగిందంటే..-kkr vs lsg rishabh pant accused of faking injury in ipl 2025 know the details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant: టీ20 ప్రపంచకప్‍‍ మాస్టర్‌ప్లాన్‍ను ఐపీఎల్‍లో పంత్ ఫాలో అయ్యాడా? ఏం జరిగిందంటే..

Rishabh Pant: టీ20 ప్రపంచకప్‍‍ మాస్టర్‌ప్లాన్‍ను ఐపీఎల్‍లో పంత్ ఫాలో అయ్యాడా? ఏం జరిగిందంటే..

Rishabh Pant - KKR vs LSG: కోల్‍కతాపై లక్నో సూపర్ జెయింట్స్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే, కీలక సమయంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ వల్ల మ్యాచ్ కాసేపు ఆగింది. ఇది పంత్ ప్లానేనా అని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Rishabh Pant: టీ20 ప్రపంచకప్‍‍ మాస్టర్ ప్లాన్‍ను ఐపీఎల్‍లో పంత్ మళ్లీ ఫాలో అయ్యాడా? ఏం జరిగిందంటే..

ఐపీఎల్ 2025 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్‌ (కేకేఆర్)పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. మంగళవారం (ఏప్రిల్ 8) ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో కేవలం 4 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, ఈ మ్యాచ్‍లో పంత్ ఓ మాస్టర్ ప్లాన్ అమలు చేశాడని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అంటున్నారు.

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 238 పరుగుల భారీ స్కోరు చేసింది. కోల్‍కతా కూడా లక్ష్యఛేదనలో దూకుడుగా ఆడింది. గెలుపు దిశగా అదరగొట్టింది. అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్ ఓ దశలో దుమ్మురేపారు. 12 ఓవర్లలోనే కేకేఆర్ 2 వికెట్లకు 149 పరుగులతో గెలుస్తుందనే పటిష్ట స్థితికి చేరింది. రహానే, వెంకటేశ్ అయ్యర్ 48 బంతుల్లోనే 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే, 13వ ఓవర్ చివర్లో రహానేను లక్నో పేసర్ శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో లక్నోకు బ్రేక్‍త్రూ దక్కింది. ఆ తర్వాత కేకేఆర్ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. చివరికి లక్నో గెలిచింది. అయితే, 13వ ఓవర్లో పంత్ ఓ ప్లాన్ అమలు చేశాడనే మాటలు వినిపిస్తున్నారు.

పంత్‍ది ఫేక్ ఇంజూరినా!

13వ ఓవర్ ప్రారంభంలో రిషబ్ పంత్ నడుము నొప్పితో బాధపడ్డాడు. దీంతో లక్నో ఫిజియో గ్రౌండ్‍లోకి వచ్చాడు. పంత్‍కు అక్కడే ట్రీట్‍మెంట్ చేశాడు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచింది. ఆ తర్వాత మళ్లీ మొదలైంది. అయితే.. రహానే, వెంకటేశ్ అయ్యర్ జోరుగా ఆడుతుండటంతో వారి లయను దెబ్బ తీయాలనే బ్రేక్ వచ్చేలా ఫేక్ ఇంజూరి ప్లాన్‍ను పంత్ అమలు చేశాడని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

ప్రపంచకప్ మాస్టర్ ప్లాన్!

గతేడాది 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‍లో పంత్ ఫేక్ ఇంజూరి ప్లాన్ అమలు చేశాడు. ఆ ఫైనల్‍లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడుతుండటంతో ఆ జట్టు గెలిచేలా కనిపిచింది. ఓ దశలో గాయంతో అల్లాడుతున్నట్టు పంత్ చేశాడు. దీంతో ఆటకు బ్రేక్ పడింది. ఆ వెంటనే క్లాసెన్ ఔటయ్యాడు. వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి దక్షిణాఫ్రికా ఓడింది. భారత్ టైటిట్ పట్టింది. అయితే, గాయమైనట్టు తాను అప్పుడు కావాలనే నాటకం ఆడానని, దక్షిణాఫ్రికా బ్యాటర్ల లయను దెబ్బకొట్టేందుకు అలా చేశానని పంత్ స్వయంగా చెప్పాడు.

టీ20 ప్రపంచకప్‍లో ఫాలో అయిన మాస్టర్ ప్లాన్‍నే ఐపీఎల్‍లో కోల్‍కతాతో మ్యాచ్‍లో పంత్ ఫాలో అయ్యాడని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. మరి పంత్ నిజంగానే ఇబ్బంది పడ్డాడా.. లేకపోతే కావాలనే చేశాడా అనేది ఇప్పటికైతే సస్పెన్సే.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం