కేకేఆర్ బౌలింగ్ హా మజాకా.. రెచ్చిపోయిన హర్షిత్, వరుణ్, నరైన్.. కుప్పకూలిన పంజాబ్ కింగ్స్-kkr bowling masterclass harshit varun narine destroy punjab kings all out for 111 ipl 2025 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  కేకేఆర్ బౌలింగ్ హా మజాకా.. రెచ్చిపోయిన హర్షిత్, వరుణ్, నరైన్.. కుప్పకూలిన పంజాబ్ కింగ్స్

కేకేఆర్ బౌలింగ్ హా మజాకా.. రెచ్చిపోయిన హర్షిత్, వరుణ్, నరైన్.. కుప్పకూలిన పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్ బొక్కబోర్లా పడింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆ టీమ్.. కేకేఆర్ బౌలర్ల దాడికి లొంగిపోయింది. టపటపా వికెట్లు పడటంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.

పంజాబ్ ను కూల్చిన కేకేఆర్ బౌలర్లు (PTI)

బలమైన బ్యాటింగ్ లైనప్.. పవర్ హిట్టర్లు.. అలవోకగా 200కు పైగా స్కోరు చేస్తున్న పంజాబ్ కింగ్స్.. గత మ్యాచ్ లో ఉప్పల్ లో సన్ రైజర్స్ పై 245 స్కోరు. కానీ మంగళవారం (ఏప్రిల్ 15) కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో సీన్ రివర్సైంది. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఆ టీమ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది.

గత మ్యాచ్ లో సీఎస్కేను 103 పరుగులకే ఆలౌట్ చేసిన కేకేఆర్ బౌలర్లు మరోసారి అదరగొట్టారు. హర్షిత్ రాణా 3, వరుణ్ చక్రవర్తి 2, సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టారు.

మెరుపులతో స్టార్ట్

ఐపీఎల్ 2025లో కేకేఆర్ తో మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగడం ఎంత పెద్ద తప్పో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు బాగా తెలిసొచ్చే ఉంటుంది. బౌలింగ్ ను అనుకూలంగా ఉన్న ముల్లాన్ పూర్ పిచ్ పై కేకేఆర్ బౌలర్లు పంజాబ్ ను ఆటాడుకున్నారు. అయితే ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్ సిమ్రన్ సింగ్ (30) మెరుపులతో పంజాబ్ స్కోరు 3 ఓవర్లకే 33.

షాకిచ్చిన హర్షిత్

కానీ కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ ను చావుదెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో ప్రియాన్ష్ తో పాటు సంచలన ఫామ్ లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఈ రెండు క్యాచ్ లను రమణ్ దీప్ అందుకున్నాడు. రెండు సిక్సర్లతో దూకుడు ప్రదర్శించిన ప్రభ్ సిమ్రన్ ను తన తర్వాతి ఓవర్లో హర్షిత్ బోల్తా కొట్టించాడు. ఈ క్యాచ్ కూడా రమణ్ దీప్ పట్టాడు.

స్పిన్నర్ల మ్యాజిక్

వరుసగా వికెట్లు పడటంతో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో మెరుపులే లేకుండా పోయాయి. హర్షిత్ రాణా సెన్సేషనల్ స్పెల్ తర్వాత స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వికెట్ వేటకు దిగారు. డెబ్యూ ప్లేయర్ ఇంగ్లిస్ స్టంప్స్ ను వరుణ్ ఎగరగొట్టాడు. ఫెయిల్యూర్ ను కొనసాగిస్తూ మ్యాక్స్ వెల్ (7) వరుణ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.

ఆ తర్వాత మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఒకే ఓవర్లో సుర్యాన్ష్, యాన్సెన్ ను ఔట్ చేసి పంజాబ్ ను మరింత చావుదెబ్బ తీశాడు. శశాంక్ (18), జేవియర్ (11) పోరాటంతో పంజాబ్ స్కోరు 110 దాటింది. కానీ శశాంక్ కు వైభవ్ ఎల్బీగా ఔట్ చేయడం.. అదే ఓవర్లో జేవియర్ రనౌట్ కావడంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం