Karun Nair: కరుణ్ నాయర్ విశ్వరూపం.. విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల వర్షం.. సగటు 752
Karun Nair: కరుణ్ నాయర్ విశ్వరూపం చూపిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతని బ్యాటింగ్ సగటు ఏకంగా 752కు చేరింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ అతడు ఏడు ఇన్నింగ్స్ లో ఆరింట్లో అజేయంగానే ఉన్నాడు.
Karun Nair: కరుణ్ నాయర్ రికార్డుల పరంపర, కళ్లు చెదిరే ఫామ్ కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా అతడు మరోసారి 44 బంతుల్లోనే 88 పరుగులు బాదాడు. దీంతో ఇప్పటి వరకూ అతని సగటు 752కు చేరింది. తన చివరి ఏడు ఇన్నింగ్స్ లో అతడు ఆరు ఇన్నింగ్స్ లో నాటౌట్ గా నిలిచాడు.

కరుణ్ నాయర్.. పరుగుల వరద
కరుణ్ నాయర్ తాజాగా గురువారం (జనవరి 16) మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ లోనూ చెలరేగాడు. 44 బంతుల్లో 88 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, ఐదు సిక్స్ లు ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర టీమ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 380 రన్స్ చేసింది.
ఈ టోర్నీలో ఏడు ఇన్నింగ్స్ లో ఐదు సెంచరీలు చేసిన నాయర్ కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. అతనికితోడు ధృవ్ షోరే, యశ్ రాథోడ్ సెంచరీలు చేశారు. జితేష్ శర్మ కూడా 33 బంతుల్లో 51 రన్స్ చేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఇలా..
విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ కు తిరుగులేకుండాపోతోంది. ఈ టోర్నీలో ఏడు ఇన్నింగ్స్ లో ఆరింట్లో అజేయంగా ఉన్నాడు. అతడు వరుసగా 112 నాటౌట్, 44 నాటౌట్, 163 నాటౌట్, 111 నాటౌట్, 112, 122 నాటౌట్, 88 నాటౌట్ స్కోర్లు చేశాడు. నిజానికి జనవరి 3న ఉత్తర ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 112 రన్స్ చేయడంతో అతడు అజేయంగా 542 రన్స్ చేసినట్లయింది. ఇది 50 ఓవర్ల క్రికెట్ లో వరల్డ్ రికార్డు.
కరుణ్ నాయర్ ఫామ్ ఇప్పుడతన్ని మరోసారి టీమిండియాలోకి తీసుకొచ్చేలా ఉంది. వచ్చే నెలలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి కరుణ్ నాయర్ హాట్ ఫేవరెట్ గా ఉన్నాడు. త్వరలోనే ఈ మెగా టోర్నీ కోసం జట్టును ఎంపిక చేయనున్నారు. 2023 నుంచి విదర్భకు ఆడుతున్న కరుణ్ నాయర్.. ఈ ఏడాది టాప్ ఫామ్ లో ఉన్నాడు.
2016లో తొలిసారి ఇండియన్ టీమ్ లోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేశాడు. అయితే తర్వాత అనూహ్యంగా జట్టులో చోటు కోల్పోయి మళ్లీ రాలేకపోయాడు. ఇప్పుడు అనూహ్యంగా పరుగుల వరద పారిస్తూ మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. విదర్భలోకి వచ్చినప్పటి నుంచీ కరుణ్ నాయర్ ఫార్మాట్ తో సంబంధం లేకుండా టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడు.
టాపిక్