టెస్టు టీమ్ రీ ఎంట్రీ కోసం పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ చెలరేగుతూనే ఉన్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన ఈ బ్యాటర్ ఆడిన తొలి ఇన్నింగ్స్ లోనే అదరగొట్టాడు. ఇండియా-ఎ తరపున ఇంగ్లాండ్ లయన్స్ లో అనఫీషియల్ టెస్టులో ద్విశతకం సాధించాడు కరుణ్ నాయర్. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
దేశవాళీ సీజన్లో పరుగుల వేటలో దూసుకెళ్తున్న కరుణ్ నాయర్ బ్యాటింగ్ లో సత్తాచాటుతున్నాడు. దేశవాళీ ప్రదర్శనతోనే ఇంగ్లాండ్ తో అయిదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియాలోకి తిరిగొచ్చాడు కరుణ్. ఈ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో ఇండియా-ఎ సిరీస్ స్టార్ట్ అయింది. ప్రాక్టీస్ కోసం ఈ సిరీస్ లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ అదరగొట్టాడు.
శుక్రవారం (మే 30) ఇంగ్లాండ్ లయన్స్ తో ఇండియా-ఎ ఫస్ట్ అనధికార నాలుగు రోజుల టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ ఓడిన ఇండియా-ఎ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన కరుణ్ నాయర్ సెన్సేషనల్ డబుల్ సెంచరీ బాదేశాడు. 281 బంతుల్లో 204 పరుగులు చేశాడు. 26 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. ఇంగ్లాండ్ లయన్స్ బౌలింగ్ ను చిత్తుచేశాడు.
కరుణ్ నాయర్ ద్విశతకంతో పాటు ఇండియా-ఎ బ్యాటింగ్ లైనప్ లో సర్ఫరాజ్ ఖాన్ (92), ధ్రువ్ జురెల్ (94) కూడా అదరగొట్టారు. దీంతో 110 ఓవర్లకు టీమ్ 7 వికెట్లకు 494 పరుగులు సాధించింది. మ్యాచ్ పై పట్టు బిగించే స్టేజ్ కు ఇప్పటికే చేరుకుంది. ముఖ్యంగా కరుణ్ నాయర్ బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. టెస్టు టీమ్ రీ ఎంట్రీ పై ఫోకస్ పెట్టిన కరుణ్ ఆ ప్లేస్ కోసం గట్టిగానే పోరాడుతున్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తో భారత టెస్టు టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఈ ఇద్దరు దిగ్గజాల నిష్క్రమణ కచ్చితంగా టీమ్ ను దెబ్బకొట్టేదే. వీళ్ల ప్లేస్ లో టీమ్ లోకి ఎవరు వస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కోహ్లి స్థానాన్ని కరుణ్ నాయర్ ఫిల్ చేసేలా కనిపిస్తున్నాడు.
డబుల్ సెంచరీతో ఫామ్ మరోసారి చాటుకోవడమే కాకుండా టీమిండియాలో ప్లేస్ కోసం రేసులో ఉన్నానని చాటాడు. గతంలో ఇంగ్లాండ్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ సాధించిన రికార్డు కరుణ్ నాయర్ కు ఉంది. భారత్ తరపున 6 టెస్టులాడిన కరుణ్ 374 పరుగులు సాధించాడు.
సంబంధిత కథనం