సాహో బట్లర్.. పెయిన్ తోనే బ్యాటింగ్.. సెన్సేషనల్ ఇన్నింగ్స్.. థ్రిల్లింగ్ మ్యాచ్ లో గుజరాత్ సంచలన విక్టరీ-jos buttlers heroics innings despite injury leads gujarat titans to sensational win over delhi capitals ipl dc vs gt ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  సాహో బట్లర్.. పెయిన్ తోనే బ్యాటింగ్.. సెన్సేషనల్ ఇన్నింగ్స్.. థ్రిల్లింగ్ మ్యాచ్ లో గుజరాత్ సంచలన విక్టరీ

సాహో బట్లర్.. పెయిన్ తోనే బ్యాటింగ్.. సెన్సేషనల్ ఇన్నింగ్స్.. థ్రిల్లింగ్ మ్యాచ్ లో గుజరాత్ సంచలన విక్టరీ

వారెవా.. బట్లర్. ఏమా పోరాటం. ఓ వైపు కండరాల నొప్పి మెలిపెడుతున్నా అసాధారణ ఫైటింగ్ స్పిరిట్ తో ఈ గుజరాత్ టైటాన్స్ ఆటగాడు అదరగొట్టాడు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై సంచలన విజయాన్ని అందించాడు.

గుజరాత్ ను గెలిపించిన బట్లర్ (REUTERS)

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ మళ్లీ అదరగొట్టింది. కండరాల నొప్పి బాధిస్తున్నా పట్టుదలతో బ్యాటింగ్ చేసిన జోస్ బట్లర్ (54 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆ టీమ్ కు అద్భుత విజయాన్ని అందించాడు. శనివారం అహ్మదాబాద్ లో జరిగిన ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆ టీమ్ 7 వికెట్ల తేడాతో టాప్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు షాకిచ్చింది.

204 పరుగుల లక్ష్యాన్ని వికెట్లు కోల్పోయి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా గెలిచింది. ఆ టీమ్ లో రూథ‌ర్‌ఫ‌ర్డ్‌ (43) కూడా మెరిశాడు. గుజరాత్ ఫస్ట్ టైమ్ 200కు పైగా టార్గెట్ ను ఛేజ్ చేయడం విశేషం.

కెప్టెన్ రనౌట్

భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ కు సెకండ్ ఓవర్లోనే షాక్ తగిలింది. ఆ టీమ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ లేని పరుగుకు ట్రై చేసి అనవసరంగా రనౌటయ్యాడు. అయినా అక్కడి నుంచి సాయి సుదర్శన్ (36), బట్లర్ కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. యంగ్ స్పిన్నర్ విప్రజ్ నిగమ్ బౌలింగ్ లో బట్లర్ రెండు కళ్లుచెదిరే సిక్సర్లు కొట్టాడు. పవర్ ప్లేలో ఆ టీమ్ 67/1తో నిలిచింది.

బట్లర్ నిలబడి

ఐపీఎల్ 2025లో సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ ఓపెనర్ సాయి సుదర్శన్ ను కుల్ దీప్ బౌలింగ్ కు వస్తూనే ఔట్ చేశాడు. అయినా బట్లర్ బాదుడు కొనసాగించాడు. అతనికి తోడు రూథ‌ర్‌ఫ‌ర్డ్‌ పవర్ హిట్టింగ్ తో చెలరేగాడు. దీంతో స్కోరుబోర్డు ఎలాంటి అడ్డు లేకుండా దూసుకెళ్లింది. మోహిత్ శర్మ ఓవర్లో రూథ‌ర్‌ఫ‌ర్డ్‌ వరుసగా రెండు సిక్సర్లు దంచాడు.

నొప్పితో బాధపడుతూ

ఈ సీజన్ లో మూడో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బట్లర్ టాప్ గేర్ లోకి వెళ్లిపోయాడు. డేంజరస్ పేసర్ స్టార్క్ బౌలింగ్ లో వరుసగా 5 ఫోర్లు కొట్టాడు బట్లర్. కండరాల నొప్పితో బాధపడుతూనే ట్రీట్ మెంట్ తీసుకుని బట్లర్ బాదుడు కొనసాగించాడు. ఈ ఓవర్ తో మ్యాచ్ గుజరాత్ వైపు తిరిగింది.

ఆఖర్లో ఉత్కంఠ

గుజరాత్ సమీకరణం 30 బంతుల్లో46 పరుగులుగా మారింది. బట్లర్ బౌండరీల వేట కొనసాగించడంతో గుజరాత్ విజయం వైపు సాగిపోయింది. 12 బంతుల్లో ఆ టీమ్ కు 15 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ 19వ ఓవర్లో రూథ‌ర్‌ఫ‌ర్డ్‌ను ఔట్ చేసిన ముకేశ్ కుమార్ 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు.

గుజరాత్ విజయానికి లాస్ట్ ఓవర్లో 10 పరుగులు కావాల్సి వచ్చింది. స్టార్క్ బౌలింగ్ లో రాహుల్ తెవాటియా వరుసగా 6, 4తో మ్యాచ్ ముగించాడు. బట్లర్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఆగిపోయినా.. జట్టు గెలవడంతో సంబరాల్లో మునిగిపోయాడు.

దంచికొట్టిన ఢిల్లీ

అంతకుముందు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. ఆ టీమ్ లో ఏ బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా.. తలా కొన్ని మెరుపు షాట్లతో టీమ్ కు పెద్ద స్కోరు అందించారు. 20 ఓవర్లలో డీసీ 8 వికెట్లకు 203 పరుగులు చేసింది.

కెప్టెన్ అక్షర్ పటేల్ (39), అశుతోష్ శర్మ (37), కరుణ్ నాయర్ (31), ట్రిస్టన్ స్టబ్స్ (31) మెరిశారు. ఆఖర్లో దూకుడుగా ఆడిన అశుతోష్ 19 బాల్స్ లోనే 37 రన్స్ చేసి టీమ్ స్కోరు 200 దాటడంలో కీ రోల్ ప్లే చేశాడు. లాస్ట్ బాల్ కు కుల్ దీప్ యాదవ్ ఫోర్ తో టీమ్ 200కి పైగా స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో ప్ర‌సిద్ద్ కృష్ణ‌ నాలుగు వికెట్లతో చెలరేగాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం