Ind vs Eng 1st T20: టీమిండియాతో తొలి టీ20కి తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. అత్యంత బలమైన టీమ్‌తో..
Ind vs Eng 1st T20: టీమిండియాతో బుధవారం (జనవరి 22) జరగబోయే తొలి టీ20 కోసం తుది జట్టును ప్రకటించింది ఇంగ్లండ్ టీమ్. తమకు అందుబాటులో ఉన్న అత్యంత బలమైన జట్టును బరిలోకి దింపబోతోంది.
Ind vs Eng 1st T20: ఇండియాతో తొలి టీ20కి ఇంగ్లండ్ రెడీ అయింది. బుధవారం (జనవరి 22) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తన తుది జట్టును అనౌన్స్ చేసింది. ఈ టీమ్ లోకి ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ తిరిగి వచ్చాడు. సుమారు ఏడాది తర్వాత అతడు తుది జట్టులోకి రావడం విశేషం.

ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
ఆస్ట్రేలియా టూర్లో చేదు అనుభవం తర్వాత మరోసారి స్వదేశంలో ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని యంగిండియా.. మళ్లీ టీమ్ ను గాడిలో పెట్టడానికి బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇండియా ఇంకా తుది జట్టును అనౌన్స్ చేయకపోయినా.. ఇంగ్లండ్ మాత్రం ఒక రోజు ముందే ప్రకటించింది.
తొలి టీ20కి ఆ టీమ్ నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. అట్కిన్సన్ తోపాటు జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, మార్క్ వుడ్ తుది జట్టులో ఉన్నారు. ఇక ఆదిల్ రషీద్ రూపంలో ఒకే ఒక స్పిన్నర్ ఉన్నాడు. లియామ్ లివింగ్‌స్టన్, జాక్ బేతెల్ కూడా పార్ట్ టైమ్ స్పిన్ వేయగలరు.
జనవరి 18న ఇంగ్లండ్ టీమ్ ఇండియాకు వచ్చింది. ఎస్ఏ20లో పాల్గొన్న లివింగ్‌స్టన్ అక్కడి నుంచి నేరుగా రావడంతో ఇంగ్లండ్ టీమ్ తరఫున ఇక్కడ అడుగుపెట్టిన తొలి ప్లేయర్ అయ్యాడు. మిగిలిన ఇంగ్లండ్ టీమ్ దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చింది.
ఇంగ్లండ్ తుది జట్టు ఇదే
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, జాకబ్ బేతెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
ఇండియా, ఇంగ్లండ్ రికార్డులు ఇలా
ఇంగ్లండ్ తో టీమిండియా ఇప్పటి వరకూ మొత్తం 24 టీ20లు ఆడింది. అందులో 11 మ్యాచ్ లలో ఇంగ్లండ్ గెలిచింది. తొలిసారి ఈ రెండు టీమ్స్ 2007 టీ20 వరల్డ్ కప్ లో ఆడాయి. ఆ మ్యాచ్ లోనే యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదిన విషయం తెలిసిందే.
ఇక ఇండియాలో ఇంగ్లండ్ 11 టీ20ల్లో ఐదింట్లో గెలిచింది. 2011లో చివరిసారి ఇండియాలో ఓ టీ20 సిరీస్ గెలిచిన ఇంగ్లండ్.. తర్వాత మరో సిరీస్ గెలవలేకపోయింది. చివరిసారి ఈ రెండు టీమ్స్ ఐదు టీ20ల సిరీస్ ఆడినప్పుడు ఇండియా 3-2తో విజయం సాధించింది. ఇక గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోనూ ఇంగ్లండ్ ను 68 పరుగులతో ఇండియన్ టీమ్ చిత్తు చేసింది.