Joe Root: కుక్‍ను దాటేసి చరిత్ర సృష్టించిన జో రూట్.. లారా, గవాస్కర్‌ను సమం చేసిన ఇంగ్లండ్ స్టార్-joe root creates history as he surpasses alastair cook in test centuries eng vs sl series ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Joe Root: కుక్‍ను దాటేసి చరిత్ర సృష్టించిన జో రూట్.. లారా, గవాస్కర్‌ను సమం చేసిన ఇంగ్లండ్ స్టార్

Joe Root: కుక్‍ను దాటేసి చరిత్ర సృష్టించిన జో రూట్.. లారా, గవాస్కర్‌ను సమం చేసిన ఇంగ్లండ్ స్టార్

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 31, 2024 09:27 PM IST

Joe Root: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో సిరీస్‍లో మరో సెంచరీ బాదాడు. దీంతో మరిన్ని రికార్డుల మోత మోగించాడు. టెస్టు శతకాల్లో అలెస్టర్ కుక్‍ను అధిగమించాడు రూట్.

Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. లారా, గవాస్కర్‌ను సమం చేసిన ఇంగ్లండ్ స్టార్
Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. లారా, గవాస్కర్‌ను సమం చేసిన ఇంగ్లండ్ స్టార్ (AFP)

ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుత ఫామ్‍లో ఉన్నాడు. టెస్టు క్రికెట్‍లో చెలరేగిపోతున్నాడు. అదిరిపోయే ఆటతో జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు సిరీస్‍లో రూట్ శతకాల మోత మోగిస్తున్నాడు. లార్డ్స్ స్టేడియం వేదికగా ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రూట్.. నేడు (ఆగస్టు 31) రెండో ఇన్నింగ్స్‌లోనూ శకతంతో సత్తాచాటాడు. ఈ క్రమంలో ఓ చరిత్ర సృష్టించాడు.

కుక్‍ను దాటి హిస్టరీ క్రియేట్ చేసిన రూట్

లంకతో రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన రూట్ టెస్టు క్రికెట్‍లో తన 34వ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్ చరిత్ర సృష్టించాడు. 33 టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్‍ను రూట్ వెనక్కి నెట్టాడు. అత్యధిక టెస్టు శతకాలు చేసిన ఇంగ్లిష్ ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ జాబితాలో రూట్, కుక్ తర్వాత కెవిన్ పీటర్సన్ (23), వాలే హమోండ్ (22), కోలిన్ కోడ్రే (22) ఉన్నారు. వీరిలో రూట్ ఒక్కడే ప్రస్తుతం ఆడుతున్నాడు.

50 సెంచరీలతో మరో రికార్డు

ఇంగ్లండ్ తరఫున 50 అంతర్జాతీయ శతకాలు చేసిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా జో రూట్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 34 సెంచరీలు చేసిన 33 ఏళ్ల రూట్.. వన్డేల్లో 16 సెంచరీలు చేశాడు. దీంతో 50 ఇంటర్నేషనల్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక అంతర్జాతీయ శతకాలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ల జాబితాలో రూట్ తర్వాత కుక్ (38), కెవిన్ పీటర్సన్ (32), గ్రహం గూచ్ (28), ఆండ్రూ స్ట్రాస్ (27) ఉన్నారు. ప్రస్తుతం ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్లలో రూట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.

లారా, గవాస్కర్‌లను సమం చేసి..

టెస్టు సెంచరీల విషయంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్, వెస్టిండీస్ లెెజెండ్ బ్రియాన్ లారాను జో రూట్ సమం చేశాడు. వారిద్దరూ కూడా 34 టెస్టు సెంచరీలను చేయగా.. రూట్ ఇప్పుడు ఆ మార్క్ చేరాడు.

టెస్టు క్రికెట్‍లో అత్యధిక సెంచరీల రికార్డు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ (51 సెంచరీలు) పేరిట ఉంది. ఆ తర్వాత జాక్వెస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార్ సంగక్కర్ (38), రాహుల్ ద్రవిడ్ (36) టాప్-5లో ఉన్నారు. మరొక్క టెస్టు సెంచరీ చేస్తే సునీల్ గవాస్కర్, లారా, మహేలా జయవర్దనె, యూనిస్ ఖాన్‍ను దాటేసి.. ఆరో ప్లేస్ చేరతాడు జో రూట్.

రూట్ సూపర్ ఫామ్

జో రూట్ నాలుగేళ్లుగా టెస్టు క్రికెట్‍లో సూపర్ ఫామ్‍లో ఉన్నాడు. 44 నెలల్లోనే 17 టెస్టు సెంచరీలు చేశాడు. కెరీర్‌లో ప్రైమ్ ఫామ్‍లో ఉన్నాడు. ఇక, ప్రస్తుతం శ్రీలంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 206 బంతుల్లో 146 పరుగులు చేశాడు రూట్. సెంచరీతో కదం తొక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో 121 బంతుల్లోనే 103 పరుగులతో రూట్ దుమ్మురేపాడు. ఓ ఎండ్‍లో వికెట్లు పడుతున్నా వేగంగా ఆడాడు.

Whats_app_banner