Jasprit Bumrah: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ బుమ్రా.. ఆ ముగ్గురు స్టార్లనూ వెనక్కి నెట్టి..
Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ముగ్గురు స్టార్ క్రికెటర్లను వెనక్కి నెట్టిన బుమ్రా.. ఈ అవార్డు అందుకున్న ఐదో ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.
Jasprit Bumrah: బుమ్రా గతేడాది టాప్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. దీంతో అందుకు తగిన రివార్డు అతనికి దక్కింది. ఐసీసీ అతన్ని క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపిక చేసింది. ప్రతిష్టాత్మ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని బుమ్రా అందుకోనున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం (జనవరి 28) ఐసీసీ వెల్లడించింది. ట్రావిస్ హెడ్, జో రూట్, హ్యారీ బ్రూక్ లాంటి క్రికెటర్లను వెనక్కి నెట్టి బుమ్రా ఈ అవార్డుకు ఎంపికవడం విశేషం.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ బుమ్రా
2024లో జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. దీంతో అతన్నే ప్రతిష్టాత్మక క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఐసీసీ ఎంపిక చేసింది. గతంలో ఈ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డును రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), అశ్విన్ (2016), విరాట్ కోహ్లి (2017, 2018) గెలుచుకున్నారు. ఈ మధ్యే బుమ్రాకు ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా దక్కిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బుమ్రానే టెస్టులలో నంబర్ వన్ ర్యాంకు బౌలర్ అయిన విషయం తెలిసిందే. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్ గా ఈ మధ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకుల్లో 900 పాయింట్ల మార్క్ ను కూడా అతడు దాటాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ లోనూ బుమ్రా రాణించాడు. 15 వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.
టెస్టుల్లో బుమ్రా సూపర్ ఫామ్
బుమ్రా గతేడాది టెస్టుల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 13 టెస్టుల్లోనే 71 వికెట్లు తీసుకున్నాడు. గతేడాది ఇవే అత్యధిక వికెట్లు కావడం విశేషం. ఒక కేలండర్ ఏడాదిలో బుమ్రా కంటే ముందు కపిల్ దేవ్ అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్.
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే బుమ్రా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. గతేడాది ఇంతటి టాప్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టే అతనికి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ పేస్ బౌలర్ కూడా అతడే.
సంబంధిత కథనం