భారత టెస్ట్ కెప్టెన్సీపై జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు మౌనం వీడాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి తనే మొదటి ఎంపిక అని, అయితే పనిభారం కారణంగా తాను కెప్టెన్సీని నిరాకరించానని వెల్లడించాడు. మొదట రోహిత్ శర్మ, తర్వాత విరాట్ కోహ్లి రెడ్-బాల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత ఇంగ్లండ్ పర్యటన కోసం శుభ్‌మాన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. తనకు దక్కాల్సిన ఈ కెప్టెన్సీ ఎలా చేతులు మారిందో బుమ్రా వివరించాడు.
స్కై స్పోర్ట్స్ కోసం మాజీ భారత వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ తో ఒక ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడాడు. గత నెలలో రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్లను ప్రకటించడానికి ముందే తాను తన పనిభారం గురించి బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లతో మాట్లాడానని అతడు చెప్పాడు. తన కెరీర్‌ను పొడిగించుకోవడానికి తన శరీరం విషయంలో తెలివిగా ఉండాలని వైద్యులు, ఫిజియోలు సలహా ఇవ్వడంతో, కెప్టెన్సీని వదులుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బుమ్రా వెల్లడించాడు.
"రోహిత్, విరాట్ ఐపీఎల్ సమయంలో రిటైర్ కావడానికి ముందు, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నా పనిభారం గురించి నేను బీసీసీఐతో మాట్లాడాను. నా వెన్ను బాగు చూసుకునే వారితో నేను మాట్లాడాను. సర్జన్‌తో కూడా మాట్లాడాను. ఆయన ఎప్పుడూ పనిభారాల విషయంలో ఎంత తెలివిగా ఉండాలనే దాని గురించి నాతో మాట్లాడాడు. కాబట్టి నేను అతనితో మాట్లాడాను. అప్పుడే నేను కొంచెం తెలివిగా ఉండాలని మేము నిర్ధారణకు వచ్చాము. అప్పుడు నేను బీసీసీఐకి ఫోన్ చేసి కెప్టెన్సీ వద్దని చెప్పాను. ఎందుకంటే నేను ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అన్ని టెస్ట్ మ్యాచ్‌లలో పూర్తి స్థాయిలో ఆడలేను" అని బుమ్రా స్పష్టం చేశాడు.
ఒకే టెస్ట్ సిరీస్ కు ఇద్దరు కెప్టెన్లు బాగోదని కూడా ఈ సందర్భంగా బుమ్రా అన్నాడు. "అవును.. బీసీసీఐ నేనే కెప్టెన్ కావాలని భావించింది. కానీ అప్పుడు నేను వద్దని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది జట్టుకు కూడా సరైంది కాదు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో.. మూడు మ్యాచ్‌లు ఒకరు, రెండు మ్యాచ్‌లు మరొకరు కెప్టెన్సీ చేయడం సరైంది కాదు. ఇది జట్టుకు న్యాయం కాదు. నా మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ జట్టుకే" అని బుమ్రా స్పష్టం చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టుకు వెన్ను గాయం కారణంగా దూరమవడం బుమ్రా కెరీర్ ను మరోసారి మలుపు తిప్పింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ మొదటి కొన్ని వారాలు ఆడలేదు. రెండోసారి వెన్ను గాయం బారిన పడటంతో బుమ్రా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రాకు పేరుంది. అలాంటి తాను ఓ ప్లేయర్ గా అన్ని ఫార్మాట్లలోనూ టీమ్ కు అందుబాటులో ఉండటమే మొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నట్లు చెప్పాడు. "నేను జాగ్రత్తగా లేకపోతే, భవిష్యత్తు గురించి నాకు తెలియదు. నేను అకస్మాత్తుగా ఈ ఫార్మాట్ నుండి దూరంగా ఉండాల్సిన పరిస్థితి రాకూడదు.
అవును, కెప్టెన్సీ చాలా ముఖ్యమైనది. నేను దాని కోసం చాలా కష్టపడ్డాను. కానీ దురదృష్టవశాత్తు, కొన్నిసార్లు మీరు పెద్ద లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నేను కెప్టెన్సీ కంటే క్రికెట్‌ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందువల్ల నేను ఒక క్రికెటర్‌గా, భారత జట్టుకు ఒక ఆటగాడిగా మరింత సహకరించాలనుకుంటున్నాను" అని బుమ్రా అన్నాడు.
సంబంధిత కథనం