Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన జస్‍ప్రీత్ బుమ్రా.. ఈ ఘనత దక్కించుకున్న భారత తొలి పేసర్‌గా..
Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాకు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు దక్కింది. గతేడాది అద్భుత ప్రదర్శన చేసిన అతడికి వురస్కారం కైవసం అయింది. దీంతో బుమ్రా ఓ చరిత్ర సృష్టించాడు.
భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో తన భీకర బౌలింగ్‍తో దుమ్మురేతున్నాడు. టీమిండియాను చాలా మ్యాచ్‍ల్లో గెలిపించాడు. గతేడాది 2024లో టెస్టుల్లో బుమ్రా అదరగొట్టాడు. పేస్, స్వింగ్, కచ్చితత్వంతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గతేడాది ఒక్కటే టెస్టుల్లో 71 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. దీంతో బుమ్రాకు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. వివరాలు ఇవే..

టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఐసీసీ పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును జస్‍ప్రీత్ బుమ్రా దక్కించుకున్నాడు. 2024కు గాను అతడికి ఈ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని ఐసీసీ నేడు (జనవరి 27) వెల్లడించింది. ఈ అవార్డు కోసం బుమ్రాతో పాటు ఇంగ్లండ్ స్టార్లు జో రూట్, హ్యారీ బ్రూక్, శ్రీలంక యంగ్ బ్యాటర్ కమిందు మెండిస్ నామినేట్ అయ్యారు. చివరికి అద్బుత బౌలింగ్‍తో దుమ్మురేపిన బుమ్రాకే 2024కు గాను ఐసీసీ అత్యుత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు దక్కింది.
చరిత్ర సృష్టించిన బుమ్రా
ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకొని జస్‍ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఈ అవార్డు కైవసం చేసుకున్న తొలి భారత పేసర్‌గా హిస్టరీ క్రియేట్ చేశాడు. 2004లో ఈ అవార్డులను ఐసీసీ మొదలుపెట్టింది. ఇండియా తరఫున ఇప్పటి వరకు రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేందర్ సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018).. టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌ను సొంతం చేసుకున్నారు. వీరి తర్వాత ఈ అవార్డు పొందిన ఆరో భారత ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి టీమిండియా పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
బుమ్రా అద్భుత ప్రదర్శన
2024లో 13 టెస్టుల్లో 71 వికెట్లు తీశాడు జస్‍ప్రీత్ బుమ్రా. 14.92 బౌలింగ్ యావరేజ్‍తో అదరగొట్టాడు. ఐదుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. గతేడాది టెస్టుల్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍లో మిగిలిన భారత బౌలర్లు తేలిపోయినా బుమ్రా అదరగొట్టాడు. ఆ ఒక్క సిరీస్‍లోనే 32 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‍లో భారత్ ఓడినా.. అతడికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. అంతలా బుమ్రా సత్తాచాటాడు. ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లోనూ బుమ్రా ప్రస్తుతం టాప్ ప్లేస్‍లో ఉన్నాడు.
ఇటీవలే టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిను కూడా బుమ్రా అధిగమించాడు. 20 కంటే తక్కువ బౌలింగ్ యావరేజ్‍తో 200 టెస్టు వికెట్ల మైలురాయిని సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
మంధానకు అవార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు కూడా ఐసీసీ అవార్డు దక్కింది. 2024కు గాను ఐసీసీ ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం స్మృతి కైవసం అయింది. 2024లోనే వన్డేల్లో 747 పరుగులు చేసి సత్తాచాటారు మంధాన. దీంతో ఈ అవార్డు దక్కించుకున్నారు.
సంబంధిత కథనం