James Anderson: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ 700 వికెట్ల పేస్ లెజెండ్ ఆండర్సన్.. తొలి టెస్టు ఆడిన చోటే ఆఖరిది కూడా..
James Anderson Retirement: ఇంగ్లండ్ పేస్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టనున్నాడు. తన ఆఖరి టెస్టుపై అధికారికంగా ప్రకటించాడు ఆండర్సన్.
James Anderson: ఇంగ్లండ్ క్రికెట్‍లో ఆల్‍టైమ్ గ్రేట్ పేసర్, దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈ విషయంపై ఆండర్సన్ నేడు (మే 11) అధికారికంగా ప్రకటించాడు. తన చివరి టెస్టు ఏదో కూడా వెల్లడించాడు. ఇప్పటి వరకు 187 టెస్టుల్లో 700 వికెట్లను పడగొట్టాడు ఆండర్సన్. టెస్టు క్రికెట్‍లో అత్యధిక వికెట్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) తర్వాత ఆండర్సనే ఉన్నాడు. అలాగే, 700 టెస్టు వికెట్లు దక్కించుకున్న తొలి పేసర్‌గానూ చరిత్ర సృష్టించాడు. ఇక 41 ఏళ్ల వయసులో లెజండరీ ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్ ఇక క్రికెట్‍కు గుడ్‍బై చెప్పనున్నాడు.
ఆఖరి టెస్టు ఇదే
ఈ ఏడాది జూలై 10వ తేదీ నుంచి వెస్టిండీస్‍తో ఇంగ్లండ్ ఆడే టెస్టు మ్యాచ్ జేమ్స్ ఆండర్సన్‍కు చివరిది కానుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ఈ టెస్టు జరగనుంది. 2003 మే 22వ తేదీన లార్డ్స్ స్టేడియంలో జింబాబ్వేతో మ్యాచ్‍తోనే ఆండర్సన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 2024 జూలైలో తన ఆఖరి 188వ టెస్టును అదే గ్రౌండ్‍లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‍కు గుడ్‍బై చెప్పనున్నాడు.
చాలా మిస్ అవుతా..
తన రిటైర్మెంట్‍ను సోషల్ మీడియా వేదికగా జేమ్స్ ఆండర్సన్ నేడు ప్రకటించాడు. ఓ లెటర్ పోస్ట్ చేశాడు. 20 ఏళ్లుగా తన దేశానికి ప్రాతినిథ్యం వహించడం అద్భుతంగా ఉందని తెలిపాడు. రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ తరఫున బరిలోకి దిగడాన్ని తాను చాలా మిస్ అవుతానని ఆండర్సన్ పేర్కొన్నాడు. తాను వైదొలిగేందుకు ఇదే సరైన సమయమని రాసుకొచ్చాడు. యువ పేసర్లకు అవకాశాలు దక్కేందుకు తాను తప్పుకుంటున్నానని కారణం చెప్పాడు. తనకు ఇంతకాలం మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు జేమ్స్.
జేమ్స్ ఆండర్సన్ కెరీర్
జేమ్స్ ఆండర్సన్ 2003లో మేలో టెస్టు ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 187 టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టాడు. అందులో 32 ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. మూడుసార్లు ఒకే మ్యాచ్‍లో పది వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 1,353 పరుగులు చేశాడు జేమ్స్. 188వ టెస్టు అతడికి ఆఖరిది కానుంది.
194 వన్డేల్లో 273 వికెట్లు తీశాడు ఆండర్సన్. 19 అంతర్జాతీయ టీ20లు ఆడిన అతడు 18 వికెట్లు పడగొట్టాడు. వన్డేలు, టీ20లకు గతంలోనే వీడ్కోలు పలికాడు ఆండర్సన్. ఇప్పుడు టెస్టులకు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది జూలై 10 నుంచి వెస్టిండీస్‍తో జరిగే టెస్టే జేమ్స్ ఆండర్సన్‍కు తుది అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.
యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకు రిటైర్మెంట్ ప్రకటించాలని జేమ్స్ ఆండర్సన్‍ను ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‍కలమ్ ఇటీవల కోరినట్టు సమాచారం బయటికి వచ్చింది. 2025-26 యాషెస్‍ను దృష్టిలో పెట్టుకొని త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పాడని తెలిసింది. దీంతో ఆండర్సన్ కూడా రిటైర్మెంట్‍పై నిర్ణయం తీసేసుకున్నాడు.