Harmanpreet Kaur: “మార్పు చేయాలంటే..”: హర్మన్ కెప్టెన్సీ తొలగింపు విషయంపై కీలక సూచన చేసిన భారత మాజీ కెప్టెన్
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్‍లో భారత మహిళల జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో హర్మన్‍ప్రీత్ కౌర్ కెప్టెన్సీ కోల్పోతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ విషయంపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడారు. కీలకమైన సూచన చేశారు.
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ తీవ్రంగా నిరాశపరిచింది. గ్రూప్ దశలోనే ఇంటి బాటపట్టింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు.. తొలి మ్యాచ్‍లోనే న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత పాకిస్థాన్, శ్రీలంకపై విజయం సాధించింది. అయితే, సెమీస్ చేరాలంటే తప్పక గెలువాల్సిన ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి పాలైంది. దీంతో హర్మన్‍ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా గ్రూప్ దశలోనే మెగాటోర్నీ నుంచి ఔట్ అయింది.
టీ20 ప్రపంచకప్‍లో భారత మహిళల జట్టు నిరాశపరచటంతో కెప్టెన్ హర్మన్‍పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆమె కెప్టెన్సీలో గత మూడు ప్రపంచకప్‍ల్లో టీమిండియా కనీసం సెమీఫైనల్‍కైనా చేరింది. అయితే, ఈసారి మాత్రం గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. దీంతో విమర్శలు పెరిగిపోయాయి. కెప్టెన్సీ నుంచి హర్మన్‍ప్రీత్ కౌర్‌ను బీసీసీఐ తొలగిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి.
మార్చాలనుకుంటే ఆలస్యం వద్దు
హర్మన్‍ప్రీత్ కౌర్ కెప్టెన్సీ తొలగింపు అంశంపై భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. ఒకవేళ కెప్టెన్‍ను మార్చాలనుకుంటే సెలెక్టర్లు వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 2025లో వన్డే ప్రపంచకప్ ఉండటంతో త్వరగానే నిర్ణయం తీసుకోవాలని పీటీఐతో ఇంటర్వ్యూలో అన్నారు.
హర్మన్‍ప్రీత్‍ను కెప్టెన్సీ నుంచి తొలగించేలాంటే ఇప్పుడే చేయాలని, ఆలస్యమైతే వద్దని మిథాలీ చెప్పారు. “కెప్టెన్‍ను మార్చాలా వద్దా అనేది బీసీసీఐ, సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మార్పు చేయాలని చూస్తే ఇదే సరైన సమయం. ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే 2025 ప్రపంచకప్ ఉంది. ఇప్పుడు చేయకపోతే.. ఆ తర్వాత కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రపంచకప్ దగ్గరపడుతుంది” అని మిథాలీ చెప్పారు. కెప్టెన్సీ మార్పు ఇప్పుడే చేస్తే 2025 వన్డే ప్రపంచకప్ కల్లా సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని మిథాలీ అభిప్రాయపడ్డారు.
స్మతిని సెలెక్టర్లు ఆలోచిస్తున్నా..
కెప్టెన్సీ కోసం స్మృతి మంధానను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటుండొచ్చని, కానీ తాను జెమీమా రోడ్రిగ్స్ లాంటి యంగ్ ప్లేయర్ గురించి ఆలోచిస్తున్నానని స్మృతి మంధాన చెప్పారు. “సెలెక్టర్లు స్మృతి మంధానను పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా నేను జెమీమా లాంటి వారి గురించి ఆలోచిస్తున్నారు. ఆమె 24 ఏళ్ల యంగ్ ప్లేయర్లు. టీ20ల్లో ఆమె ఇంకా చాలా కాలం ఆడగరు. మైదానాన్ని ఎనర్జీతో ఆమె నింపేయగలదు. ఆమె అందరితో మాట్లాడుతుంది. ఈ టోర్నీలో ఆమె ప్రదర్శన పట్ల నేను చాలా ఇంప్రెస్ అయ్యా” అని మిథాలీ రాజ్ చెప్పారు.
టీ20 ప్రపంచకప్‍లో భారత్ విఫలమవటంతో కెప్టెన్ హర్మన్‍ప్రీత్ కౌర్‌ను కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించనుందని రిపోర్టులు బయటికి వచ్చాయి. హెడ్‍కోచ్ అమోల్ మజుందార్, సెలెక్షన్ కమిటీతో ఈ విషయంపై బీసీసీఐ చర్చించనుందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. ఆ తర్వాతే హర్మన్ కెప్టెన్సీపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుందట. ఒకవేళ కెప్టెన్సీ నుంచి తొలగించినా జట్టులో హర్మన్ కీలక ప్లేయర్‌గానే ఉంటారని బీసీసీఐకు చెందిన ఓ అధికారి చెప్పారని ఆ రిపోర్ట్ పేర్కొంది. స్మృతి మంధానను కొత్త కెప్టెన్‍గా చేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి బీసీసీఐ చివరికి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.