Ishan Kishan: బౌలర్లకు చుక్కలే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మరో డేంజరస్ బ్యాటర్.. సిక్సర్లే సిక్సర్లు.. మామూలుగా ఉండదు
Ishan Kishan: సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటేనే ఐపీఎల్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఐపీఎల్ 2024లో ఆ టీమ్ బ్యాటర్ల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ బ్యాటింగ్ లైనప్ కు మరో డేంజరస్ ప్లేయర్ యాడ్ అయ్యాడు. రాబోయే ఐపీఎల్ లో సన్‌రైజర్స్ విధ్వంసం మామూలుగా ఉండదు.
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రికార్డుల దుమ్ము దులిపేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమవుతోంది. గతేడాది స్టేడియాల్లో పరుగుల వరద పారించిన ఆ టీమ్.. ఈ సారి అంతకుమించిన బాదుడుతో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. అసలే స్ట్రాంగ్ గా ఉన్న బ్యాటింగ్ లైనప్ కు మరింత పవర్ ను యాడ్ చేసుకుంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చెలరేగాడు. బౌలర్లకు వార్నింగ్ పంపాడు.
వివాదాస్పదం
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తరపున అదరగొట్టి టీమిండియాలో కీలకంగా ఎదిగిన ఇషాన్ కిషన్ త్వరగానే డౌన్ ఫాల్ చూశాడు. మెంటల్ హెల్త్ కండీషన్ తో జట్టుకు దూరమవుతున్నానని చెప్పి ఇషాన్ బయట ఎంజాయ్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. బీసీసీఐ చెప్పినా దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో సెంట్రల్ కాంట్రాక్టు లిస్ట్ లో ప్లేస్ గల్లంతైంది. అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎంత చెప్పినా ఇషాన్ కిషన్ తన పద్ధతి మార్చుకోలేదు.
రూ.11.25 కోట్లకు
కెరీర్ లో అప్పుడే అన్నీ చూసిన ఇషాన్ కిషన్ ఈ ఐపీఎల్ సీజన్ తో తిరిగి సత్తాచాటాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. మెగా వేలంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ను సన్‌రైజర్స్ ఏకంగా రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఉప్పల్ స్టేడియంలో జట్టు ప్రాక్టీస్ లో చేరిన ఇషాన్ కిషన్.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో అదరగొట్టాడు. 24 బంతుల్లోనే 64 పరుగులు చేశాడు. ధనాధన్ షాట్లు కొట్టాడు. భారీ సిక్సర్లు బాదాడు. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన ఇషాన్ బౌలర్లపై డామినెన్స్ ప్రదర్శించాడు.
ఏ ప్లేస్ లో
ఐపీఎల్ 2024 సీజన్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి విధ్వంసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ రికార్డులు తిరగరాసింది. ఐపీఎల్ లో హైయ్యస్ట్ స్కోరు చేసిన టీమ్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు వీళ్లకు ఇషాన్ కిషన్ కలిశాడు. డైనమైట్ లా పేలే ఇషాన్ ఈ ఐపీఎల్ లో బౌలర్ల పాలిట విలన్ లా మారే ఛాన్స్ ఉంది. అయితే అతను ఏ ప్లేస్ లో ఆడతాడన్నది సందేహంగా మారింది.
ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇషాన్ కు ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. అతను బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు వచ్చే అవకాశాలే ఎక్కువ.
సంబంధిత కథనం