ఉప్పల్ లో మరోసారి పరుగుల విందుకు సిద్దమైపోండి. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ.. బౌలర్లను ఊచకోత కోస్తూ.. భారీ స్కోర్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సై అంటోంది. గురువారం (మార్చి 27) హైదరాబాద్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతోంది. 300 స్కోరుపై కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో ఎంతలా చెలరేగుతుందో చూడాలి.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. మరోసారి బ్యాటింగ్ మోతతో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనుంది.
ఐపీఎల్ 2024లో పరుగుల తుపాన్ లో ఫ్యాన్స్ ను ముంచెత్తిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లోనూ దంచుడు కొనసాగిస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఉప్పల్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లో సన్‌రైజర్స్ చెలరేగింది. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో టీమ్ ఏకంగా 286 పరుగులు చేసింది. ఐపీఎల్ లో తన పేరు మీదే ఉన్న టాప్ స్కోర్ రికార్డుకు ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున డెబ్యూ చేసిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ లో 47 బాల్స్ లోనే 106 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. 11 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 67) కూడా అదరగొట్టాడు. ఛేజింగ్ లో గట్టిగానే పోరాడిన రాజస్థాన్ 242/6 స్కోరుకే పరిమితమైంది.
రిషబ్ పంత్ కెప్టెన్సీలో సరికొత్తగా ఐపీఎల్ 2025 బరిలో దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో సీజన్ ను స్టార్ట్ చేసింది. వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో 1 వికెట్ తేడాతో ఓడింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో లక్నో ఓటమి వైపు నిలిచింది.
ఫస్ట్ లక్నో 209/8 స్కోరు చేసింది. ఛేజింగ్ లో ఢిల్లీ 19.3 ఓవర్లలో గెలిచింది. అశుతోష్ శర్మ (31 బంతుల్లోనే 66 నాటౌట్) ఢిల్లీని గెలిపించాడు. ఈ మ్యాచ్ లో సున్నా పరుగులే చేసిన పంత్.. కెప్టెన్ గానూ ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో షాబాజ్ అహ్మద్ ప్లేస్ లో పేసర్ అవేశ్ ఖాన్ ను లక్నో ఆడిస్తోంది.
ఉప్పల్ స్టేడియంలో మరోసారి పరుగుల విందు ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామంగా మారింది. పైగా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ లోనూ పవర్ హిట్టర్లున్నారు. ఈ రెండు టీమ్స్ తమ తొలి మ్యాచ్ ల్లో 200కు పైగా స్కోరు చేశాయి. ఈ ఫ్లాట్ వికెట్ పై మరోసారి భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొత్తం 528 పరుగులు నమోదయ్యాయి.
సంబంధిత కథనం