ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు పటాపంచలవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా కోల్ కతాను వీడని వరుణుడు కాస్త శాంతించాడు. ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్ కు దారినిస్తున్నాడు. ఫ్యాన్స్ ప్రార్థనలకు కరిగిన వరుణుడు మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలను కల్పిస్తున్నాడు. ఈడెన్ గార్డెన్స్ లో ఎండ బాగా కాస్తోంది. శుక్రవారం నుంచి ఇక్కడ వర్షం పడ్డ సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ, ఫస్ట్ మ్యాచ్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. బాలీవుడ్ తారల ఆటలు, పాటలతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేలా షెడ్యూల్ రూపొందించింది. కానీ వర్షం కారణంగా ఈ ఓపెనింగ్ సెర్మనీ రద్దవుతుందేమో అనిపించింది.
నిన్నటి వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ఈడెన్ గార్డెన్స్ లో సాయంత్రం వర్షం కురిసేందుకు 80 శాతం ఛాన్స్ ఉందనే వార్తలొచ్చాయి. దీంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ ఇప్పుడు వరుణుడు వెనక్కి తగ్గాడు. ఆకాశంలోని నల్లటి మేఘాలు కూడా మాయమయ్యాయి. క్లియర్ స్కై కనిపిస్తోంది.
ఈడెన్ గార్డెన్స్ లో వరుణుడు శాంతించడంతో షెడ్యూల్ ప్రకారమే ఓపెనింగ్ సెర్మనీ, ఫస్ట్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రేయా ఘోషల్, కరన్ ఔజ్లా సింగింగ్ తో అలరించనున్నారు.
బాలీవుడ్ గ్లామర్ డాల్ దిశా పటాని స్పెషల్ పర్ ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా ఈ ప్రోగ్రామ్ లో భాగమయ్యే అవకాశముంది. ఈ వేడుకలు సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఆకాశం క్లియర్ గా ఉంటుందని, వర్షం పడే అవకాశాలు చాలా స్వల్పమని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది.
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 7.30 కు స్టార్ట్ అవుతుంది. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో మ్యాచ్ లు చూడొచ్చు. జియోహాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించొచ్చు.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. బ్యాటింగ్ స్వర్గధామమైన ఈ స్టేడియంలో భారీ పరుగులు నమోదయ్యే అవకాశముంది. ఈ స్టేడియంలోనే పంజాబ్ కింగ్స్ రికార్డు స్థాయిలో 262 పరుగుల ఛేజింగ్ ను కంప్లీట్ చేసింది. టీ20 హిస్టరీలోనే ఇదే అత్యధిక సక్సెస్ ఫుల్ ఛేజ్. ఇప్పుడు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లోనూ పరుగుల వరద పారుతుందా? లేదా వర్షం కారణంగా బౌలర్లు అదరగొడతారా? అన్నది చూడాలి.
సంబంధిత కథనం