IPL 2025: అప్పుడే ఐపీఎల్ 2025 స్టార్ట్.. తొలి మ్యాచ్ లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ.. ఉప్పల్ లో మ్యాచ్ ఎప్పుడంటే?
IPL 2025: పొట్టి క్రికెట్ మజాను అందించేందుకు ఐపీఎల్ మరోసారి సిద్ధమైంది. ధనాధన్ ఇన్నింగ్స్ లతో అలరించేందుకు ఐపీఎల్ 2025 వచ్చేస్తోంది. కొత్త సీజన్ కు వచ్చే నెలలోనే తెరలేవనుంది. సీజన్ ప్రారంభ తేదీ, ఓపెనింగ్ మ్యాచ్ పై చర్చ జోరుగా సాగుతోంది.

టీ20 క్రికెట్ మజాతో అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ కొత్త సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. ఐపీఎల్ 2025 మార్చి 22న ఆరంభం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి. తొలి మ్యాచ్ లో ఢిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయని సమాచారం. ఇంకా ఐపీఎల్ 18వ సీజన్ షెడ్యూల్ పై అధికారిక ప్రకటన రాలేదు.
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ
గత సీజన్ ఛాంపియన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో ఐపీఎల్ 2025కు తెరలేవనుందని క్రిక్ బజ్ పేర్కొంది. కేకేఆర్ సొంతగడ్డ అయిన ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుందని తెలిపింది. మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమవుతుందని ఐపీఎల్ వర్గాలు తెలిపాయని క్రిక్ బజ్ తన కథనంలో వెల్లడించింది. ఫైనల్ కూడా ఈడెన్ గార్డెన్స్ లోనే మే 25న జరుగుతుందని తెలిపింది.
ఉప్పల్ లో మ్యాచ్
గత ఐపీఎల్ సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల విధ్వంసం గురించి తెలిసిందే. దీంతో ఈ సారి ఈ స్టేడియంలో సన్ రైజర్స్ మ్యాచ్ ల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2025లో మార్చి 23న సన్ రైజర్స్ ఉప్పల్ స్డేడియంలో మధ్యాహ్నం తన తొలి మ్యాచ్ ఆడబోతుందని సమాచారం. గత ఐపీఎల్ లో సన్ రైజర్స్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 10 ఫ్రాంఛైజీల చెందిన వేదికలతో పాటు ఈ సారి అదనంగా ధర్మశాల, గువాహతి లో కూడా మ్యాచ్ లు నిర్వహించబోతున్నారని సమాచారం.
ప్లేఆఫ్స్ ఎక్కడంటే?
ఈ ఏడాది జనవరి 12న బీసీసీఐ స్పెషల్ ఏజీఎం తర్వాత ఐపీఎల్ 2025 మార్చి 23న ఆరంభమవుతుందని వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హింట్ ఇచ్చాడు. కానీ ఒక రోజు ముందుగానే కొత్త సీజన్ ఆరంభమయ్యే అవకాశముంది.ఇప్పటికే షెడ్యూల్ కు సంబంధించిన సమాచారం ఆయా ఫ్రాంఛైజీలకు చేరిందని తెలిసింది. ప్లేఆఫ్స్ మ్యాచ్ ల వేదికలు కూడా ఖరారయ్యాయి. క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లు హైదరాబాద్ లో.. క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ లు కోల్ కతా లో జరగబోతున్నాయి.
సంబంధిత కథనం